గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డిఫేస్మెంట్ యాక్ట్ ను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది GHMC. దీంతో గోడలపై వాల్ రైటింగ్, వాల్ పోస్టర్, బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు లాంటి వాటికి అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తే ఫైన్ లు వేస్తుంది. GHMC లోని ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిబ్బందికి ఈ పనులు అప్పజెప్పారు అధికారులు. నగరంలోని మాల్స్, షాపులు దగ్గర అనధికారికంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు ఫ్లెక్సీలు కూడా ఫైన్ లు వేస్తున్నారు.
ఇక తాజాగా ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన టూలెట్ బోర్డ్ కు GHMC సిబ్బంది ఫైన్ వేశారు. ఏఫోర్ సైజు లో ఉన్న పేపర్ పై ప్రింట్ తీసి అతికించి నందుకు రెండు వేల రూపాయలు ఫైన్ వేసింది GHMC ఎన్ఫోర్స్మెంట్ విభాగం. దానిని నేరుగా జిహెచ్ఎంసి కార్యాలయం లేదా ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాలి అంటూ నోటీస్ జారీ చేసింది. గతంలోనూ జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ విభాగం వేసిన ఫైన్ లపై కౌన్సిల్ మీటింగ్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కార్పొరేటర్లు. కర్రీ పాయింట్ లు చిరు వ్యాపారులు చిన్న బ్యానర్లు ఏర్పాటు చేసుకున్నా ఫైన్ లు వేశారని మండిపడ్డారు. ఈ అంశంపై ప్రత్యేక కమిటీ వేసి ఎలాంటి ఫైన్లు వేయాలి.. వేసిన వాటిలో ఏవి చెల్లించాలి అనేది తేలుస్తామని చెప్పినప్పటికీ అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
వివిధ కార్యక్రమాల కోసం ప్రజా సంఘాలు వేసిన పోస్టర్లు బ్యానర్లకు ఫైన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. హోమ్ ట్యూషన్స్ కోసం ఏ ఫోర్ సైజు లో ప్రింట్ అవుట్ లు తీసి కాలనీలో అతికించిన సందర్భాల్లో నూ జరిమానాలు విధించింది జిహెచ్ఎంసి. గతంలో ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఇనిస్టిట్యూషన్ కు లక్షలాది రూపాయలు ఫైన్ వేసినట్లు కార్పొరేటర్లు కౌన్సిల్లో ఆరోపించారు. అయితే ఇలాంటి చిన్న అంశాలపై ఫైన్ లు వేయడం సరికాదన్నారు సిటిజెన్స్. రాజకీయ నాయకులు ఏర్పాటు చేసే పెద్దపెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లను వదిలేసి చిన్నచిన్న వ్యక్తులపై పడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉల్లంఘనల పేరుతో చిన్న సంస్థలు వ్యక్తులకు భారీ మొత్తంలో ఫైన్లు వేసినట్లు జిహెచ్ఎంసీ పై ఆరోపణలు ఉన్నాయి. కాలనీలు, బస్తీల్లో ఇల్లు కట్టుకునే వారు రోడ్ సైడ్ మెటీరియల్ వేస్తే దానిపై కూడా ఫైన్ వేయడంపై కూడా విమర్శలు వచ్చాయి. అధికారులు ఇలాంటి అంశాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నారు నగరవాసులు.