- నేడు ప్రారంభించనున్న మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు
- ఎక్కడా మొక్కలు వృథా కాకుండా చర్యలు
- ప్రస్తుతం సేఫ్ జోన్లోనే భాగ్యనగరం
హైదరాబాద్, వెలుగు: వన మహోత్సవానికి బల్దియా రెడీ అయింది. 30 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. వీటికి అదనంగా మరో లక్ష మొక్కలను నేరుగా నగరవాసులకు అందించనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రేటర్లో 69 లక్షల జనాభా ఉండగా, ప్రస్తుతం కోటికి చేరింది.
డబ్ల్యూహెచ్‌వో నిబంధనల ప్రకారం ఒక మనిషికి 9 చ.మీ. గ్రీనరీ అవసరం కాగా, ప్రస్తుతం నగరంలో 8.18 చ.మీ. ఉంది. ఆ కొద్ది మేర తక్కువగా ఉన్న గ్రీనరీని ఫుల్ ఫిల్ చేసే పనిలో జీహెచ్ఎంసీ పడింది. ఈసారి వన మహోత్సంతోపాటు పలు కార్యక్రమాలు చేపట్టి పచ్చదనాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
గ్రేటర్లో 12.8 శాతం ఫారెస్ట్
గ్రీనరీలో హైదరాబాద్ ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీకి 2022లో వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు కూడా లభించినట్లు పేర్కొన్నారు. గ్రేటర్లో ప్రస్తుతం 12.8 శాతం ఫారెస్ట్ ఉందని, ఇతర మెట్రో పాలిటన్ సిటీలతో పోలిస్తే ఫర్వాలేదని అభిప్రాయ పడుతున్నారు. అయినప్పటికీ ఉన్న అటవీ ప్రాంతాలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
హరితహారం స్థానంలో వన మహోత్సవం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిఏటా వర్షాకాలంలో నిర్వహించిన హరితహారం స్థానంలో వన మహోత్సాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. గతంలో గ్రేటర్లో కోటి మొక్కలు నాటినట్లు లెక్కలు చెబుతున్నప్పటికీ అందులో కొన్ని జీహెచ్ఎంసీ నేరుగా నాటింది. మిగతావి అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆదేశాల మేరకు అధికారులు ప్రజలకు పంపిణీ చేశారు. అందులో చాలా వరకు వృథా అయ్యాయి. ఈసారి ఎక్కడా మొక్కలు వృథా కాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
అవసరమైన చోట పార్కులు
ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 1032 పార్కులు ఉన్నాయి. ఇంకా అవసరమైన చోట స్థలాలు ఉంటే కొత్తగా పార్కులనూ డెవలప్ చేసేందుకు జీహెచ్ఎంసీ రెడీగా ఉంది. అవసమైనచోట గార్డెన్స్ ఏర్పాటు చేయడంతోపాటు వాటి నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. వన మహోత్సవం తర్వాత పార్కుల్లో గ్రీనరీపై మరింత ఫోకస్ చేయనున్నట్లు జీహెచ్ఎంసీ బయోడైవర్సిటీ అధికారులు చెబుతున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కింద పార్కుల్లో వద్ద గ్రీనరీని పెంచేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు.
రామంతాపూర్ నుంచి షురూ
గ్రేటర్ పరిధిలో సోమవారం నుంచి వన మహోత్సవం ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు రామంతాపూర్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గతంలో నాటిన మొక్కల వల్ల అంతర్జాతీయ స్థాయిలో ట్రీ సిటీ అవార్డు వచ్చినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం నగరంలో 147 శాతం అటవీ విస్తీర్ణం పెరిగినట్లు తేలిందని చెబుతున్నారు.