మ్యాన్‌హోల్‌లో పడి చనిపోయిన చిన్నారి మౌనిక కుటుంబానికి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అండగా నిలిచారు. మౌనిక కుటుంబానికి జీహెచ్ఎంసీ తరపున రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ మేరకు మౌనిక కుటుంబానికి ఆమె చెక్కును అందజేశారు. తమ బిడ్డను తలుచుకుంటూ రోదిస్తున్న మౌనిక తల్లిదండ్రులను మేయర్ ఓదార్చారు. అన్నీ రకాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆమె వారికి హామీ ఇచ్చారు.
అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మౌనిక కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. మంత్రి తలసాని మౌనిక కుటుంబ సభ్యులకు వారి నివాసంలో చెక్కును అందజేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.
పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చిన చిన్నారి మౌనిక ప్రమాదవశాత్తూ మ్యాన్‌హోల్‌లో పడి దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. చివరకు పార్క్ లైన్ మ్యాన్‌హోల్ వద్ద చిన్నారి మృతదేహాం లభ్యమైంది. ఈ ఘటన అందరినీ కలచివేసింది. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మౌనిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.