నిమజ్జనం చెత్త 8 వేల మెట్రిక్ టన్నులు

  • 10 వేల మంది శానిటేషన్ సిబ్బంది 
  • తొలగింపు చేపట్టి తరలించిన బల్దియా

హైదరాబాద్, వెలుగు: గణేశ్ నిమజ్జన వ్యర్థాల తొలగింపును జీహెచ్ఎంసీ చేపట్టింది. సిటీ అంతటా శోభాయాత్ర రోడ్లను క్లీన్ చేశారు. 10 వేల మంది శానిటేషన్ కార్మికులతో ప్రత్యేక టీమ్స్​ని ఏర్పాటు చేసి తొలగింపు కొనసాగించారు. గురువారం ఒక్కరోజే 8,424 టన్నుల వ్యర్థాలను తొలగించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వ్యర్థాలు వెలువడగా.. ఇందులో పేపర్ ప్లేట్లు, పూజా, అలంకరణ సామగ్రి ఎక్కువగా ఉంది.

గ్రేటర్​లో  పరిధిలో లక్షలకుపైగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం జరిగింది. జీహెచ్ఎంసీ 27 పర్మినెంట్ బేబి పాండ్స్​, 24 పోర్టబుల్ వాటర్ ట్యాంక్, 23  కృత్రిమ కొలనుల(ఎక్సావేషన్ వాటర్ ట్యాంక్ )ల్లో శుక్రవారం రాత్రి వరకు  91,154 విగ్రహాల నిమజ్జనం అయినట్టు బల్దియా అధికారులు తెలిపారు.  అధికంగా శేరిలింగంపల్లి జోన్ లో 26,202, ఖైరతాబాద్ లో 21,793, కూకట్ పల్లిలో 18,970, ఎల్​బీనగర్ లో 10,452,  సికింద్రాబాద్ 11,112,  చార్మినార్​లో 2,625 విగ్రహాల నిమజ్జనం జరిగింది. ఇందులో అత్యధికంగా ట్యాంక్ బండ్​లో నే 25 వేలకిపైగా  నిమజ్జనం జరిగాయి.