హై లెవెల్ ​కమిటీ సూచనలను పట్టించుకోని బల్దియా

హై లెవెల్ ​కమిటీ సూచనలను పట్టించుకోని బల్దియా
  • హై లెవెల్ ​కమిటీ సూచనలను పట్టించుకోని బల్దియా
  • ఫీవర్ హాస్పిటల్, ఐపీఎంకి డైలీ 200లకి పైగా కుక్క కాటు కేసులు
  • కుక్కల బెడద నుంచి కాపాడలంటూ బల్దియాకి పెరిగిన ఫిర్యాదులు
  • సర్జరీల పేరుతో తీసుకెళ్లి ఎక్కడపడితే అక్కడ వదిలేస్తున్న సిబ్బంది

హైదరాబాద్, వెలుగు:  సిటీలో కొద్దిరోజుల పాటు తగ్గిన కుక్కల దాడులు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. అనేక చోట్ల కుక్కలు దాడులకు పాల్పడిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఫలితంగా నారాయణగూడలోని ఐపీఎం(ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసన్)తో పాటు ఫీవర్ ఆస్పత్రికి బాధితులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు ఆస్పత్రులకు డైలీ 200 మందికి పైగా వ్యాక్సిన్ కోసం వస్తున్నారు. మరో పక్క కుక్కల నుంచి కాపాడాలంటూ జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సిటీలోని అనేక చోట్ల నుంచి కంప్లయింట్లు వస్తుండటంతో కాలనీల్లోంచి కుక్కలను అబ్జర్వేషన్ కోసం సెంటర్లకు తరలిస్తున్న సిబ్బంది తిరిగి వాటిని అక్కడ వదలడం లేదు. వేరే ప్రాంతాల్లో విడిచిపెడుతుండటంతో వాటి మధ్య గొడవలు మొదలై మనుషులపై దాడులు చేస్తున్నాయి. దీంతో కుక్కలను తరలించేందుకు వచ్చిన డాగ్ క్యాచింగ్ సభ్యులను జంతు ప్రేమికులు చాలా చోట్ల అడ్డుకుంటున్నారు. 

సరైన అవగాహన లేకుండా..

అమీర్​పేటలో కుక్కలు కరుస్తున్నాయని ఇటీవల ఫిర్యాదు అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు అక్కడి నుంచి ఈ  నెల 11న కుక్కలను పట్టుకొని కొన్నింటికి సర్జరీలు చేసి తిరిగి అదే కాలనీలో వదిలిపెట్టారు. అయితే అందులో రెండు కుక్కలు అనారోగ్యానికి గురయ్యాయి. గత శుక్రవారం ఓ కుక్క చనిపోయింది. డాగ్ క్యాచింగ్ సిబ్బందే కుక్క మరణానికి కారణమని సీరియస్ అయిన డాగ్ ఫీడర్ వారిపై చర్యలు తీసుకోవాలంటూ పంజాగుట్ట పీఎస్​లో ఫిర్యాదు చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న డాగ్ క్యాచింగ్ టీమ్స్​కు కుక్కలను పట్టుకోవడంలో సరైన శిక్షణ ఉండటం లేదు. ఇష్టానుసారంగా పట్టుకెళ్లి, ఎక్కడ పడితే అక్కడ వదిలి పెడుతున్నారు. వదిలిపెట్టే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించడం లేదని జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. దీంతో కూడా కుక్కల దాడులు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. 

నియంత్రణపై కమిటీ సభ్యుల అసంతృప్తి

గ్రేటర్​లో కుక్కల నియంత్రణపై హై లెవెల్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎన్ని రకాల సూచనలు, సలహాలు ఇచ్చినా ఆ విధంగా పనులు చేపట్టడం లేదని పలువురు సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల నియంత్రణకు కమిటీ ఏర్పడి ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటించిన సభ్యులు.. చేపట్టాల్సిన జాగ్రత్తలపై 26 అంశాలతో నివేదిక రూపొందించి మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. స్టెరిలైజేషన్ సంఖ్యను రోజు వారీగా 300 నుంచి 400కు పెంచేలా, డాగ్ క్యాచ్​ టీమ్​లు రాత్రి వేళల్లో కూడా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెటర్నరీ సేవలను పటిష్టం చేసేందుకు వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్లను వార్డుకు ఇద్దరు చొప్పున నియమించాలని, మరో 31 మంది ప్రైవేట్ వెటర్నరీ డాక్టర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీటితో పాటు మరికొన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.  కానీ వీటిపై జీహెచ్ఎంసీ దృష్టిపెట్టకపోవడంతో సభ్యులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు.

నాన్​వెజ్ షాపులపై చర్యలెక్కడ?

నాన్​వెజ్ షాపుల వద్ద వ్యర్థాల కోసం కుక్కలు గుమిగూడుతూ, జనావాసాల్లోనే ఉంటూ దాడులకు పాల్పడుతున్నాయని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు.. నాన్​వెజ్ షాపుల వేస్టేజ్​ను చుట్టుపక్కల పడేయకుండా చర్యలు తీసుకుంటామని గతంలో ప్రకటించారు. కానీ ఆ విధంగా చర్యలు చేపట్టడం లేదు. అంబర్​పేటలో జరిగిన కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన ఘటన తర్వాత నాన్ వెజ్ షాపుల వద్ద బల్దియా సిబ్బంది కాపలా ఉండి మరీ నిఘాపెట్టినప్పటికీ కొన్నాళ్లకు పరిస్థితి మళ్లీ మొదటకు వచ్చింది. ఎలాంటి చర్యలు లేకపోవడంతో నాన్​వెజ్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడే పడేస్తున్నారు. దీంతో కుక్కలు అదే ప్రాంతంలో గుమిగూడి ఉంటూ దారిన పోయే వారిపై దాడి చేస్తున్నాయి. 

మా సూచనలు  పట్టించుకోవడం లేదు

కుక్కల నియంత్రణపై హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసినా ప్రయోజనం లేదు. మేము ఎన్ని సూచనలు చేసినా పట్టించుకోవడం లేదు. 26 రకాల సూచనలు చేస్తే ఒక్కదాన్ని కూడా సరిగా అమలు చేయడం లేదు. కుక్కల దాడులు పెరగడానికి ఓ రకంగా జీహెచ్ఎంసీనే కారణమవుతోంది.
- శ్రవణ్, మల్కాజిగిరి కార్పొరేటర్,
 హై లెవెల్ కమిటీ సభ్యుడు