హైదరాబాద్ సిటీలో ట్యాక్స్ కలెక్షన్ పై జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. టాక్స్ కట్టని వాళ్ల ఆస్తులను జప్తు చేస్తోంది. ఇప్పటివరకు 430 ప్రాపర్టీస్ ను సీజ్ చేసినట్టు స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ టాక్స్ కలెక్షన్ టార్గెట్ 2 వేల కోట్లయితే..ఇప్పటి వరకు కలెక్ట్ అయింది 15 వందల కోట్లే. దీంతో ట్యాక్స్ కలెక్షన్స్ టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు జీహెచ్ఎంసీ మరింత దూకుడు పెంచి ట్యాక్స్ కట్టని వాళ్ల ఆస్తులు జప్తు చేస్తోంది.
అప్పుల్లో జీహెచ్ఎంసీ..ఆదాయమెట్ల.?
గ్రేటర్హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2024–25 ఏడాది బడ్జెట్ రూ. 7,937 కోట్లు. అసెంబ్లీ బడ్జెట్ లో ప్రభుత్వం కేటాయించింది రూ.1,100కోట్లు. మిగిలినవి ప్రభుత్వం నుంచి నిధులు అడగాలని చూస్తోంది జీహెచ్ఎంసీ. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్న జీహెచ్ఎంసీ ఈ ఏడాదంతా నడవాలంటే ఆదాయంపై దృష్టి పెట్టక తప్పదు.
గత ప్రభుత్వ హయాంలో ఆస్తి పన్నులు సైతం సరిగా చెల్లించ లేదు. 9 ఏండ్లలో బీఆర్ ఎస్ ప్రభుత్వం బల్దియాకు రూ. 1,776 కోట్లు మాత్రమే నిధులు ఇచ్చింది. దీంతో రూ. 7,113 కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం రోజుకు రూ.1.30 కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ప్రాపర్టీ ట్యాక్స్, టౌన్‌ప్లానింగ్ నుంచి ఆదాయం రాకపోతే జీతాలు కూడా అందని పరిస్థితి ఉంది. అందుకే బల్దియా మేజర్ ఆదాయ వనరు పన్ను వసూళ్లని, ఆస్తి పన్ను సక్రమంగా వసూలు చేయాలని, బకాయిలపై దృష్టి సారిస్తోంది. పన్ను కట్టని వాళ్ల ఆస్తులను జప్తు చేస్తోంది.