- గ్రేటర్ పరిధిలో సుమారు 95 వేల కోట్ల సొంత ఆస్తులు
- కొన్ని భవనాల్లో ఖాళీగా ఉన్న షెటర్లను అద్దెకివ్వట్లేదు
- లీజుకిచ్చినవి గడువు తీరినా పాత అద్దెనే వసూలు
హైదరాబాద్, వెలుగు: సిటీ అభివృద్ధి పేరుతో వేల కోట్ల అప్పులు తెస్తున్న బల్దియా సొంత ఆమ్దానీపై మాత్రం దృష్టి పెట్టడంలేదు. ఆరు జోన్లలో బిల్డింగ్లు, మార్కెట్లు, షాపులు లాంటివి ఉండగా, ఆస్తుల విలువ దాదాపు 95 వేల కోట్ల వరకు ఉంటుంది. వీటి మెయింటెనెన్స్, పరిరక్షణతో పాటు అద్దె వసూలు బాధ్యత ఎస్టేట్ విభాగం అధికారులు చూస్తుంటారు. బల్దియా రాబడి పెంచుకునే ఆలోచన చేయక, లీజు గడువు పూర్తయిన వాటిని పట్టించుకోకపోవడంతో భారీగా ఆదాయం కోల్పోతుంది. ఉన్నతాధికారులు కూడా నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. గ్రేటర్లో మొత్తం 22 కమర్షియల్ బిల్డింగ్స్,16 మార్కెట్లు, వివిధ బిల్డింగ్స్‌లో 3 వేల షెటర్లు బల్దియాకు ఉన్నాయి. కొన్నింటిని ఆఫీసులు వాడుతుండగా, మిగతా వాటిని వ్యాపారులకు, ఆఫీసులకు లీజుపై కొనసాగిస్తుంది. ఇలా 20 ఏండ్లుగా లీజుపైనే నడుస్తుండగా, గడువు పూర్తయినా అధికారులు పట్టించుకోవడంలేదు. కొత్త టెండర్లు వేసి వేలం ద్వారా కేటాయించాల్సినా పాత రేట్లను వసూలు చేస్తుండగా కోట్లలో బల్దియాకు ఆదాయం పోతుంది. ఉన్నవాటిని పాత అద్దెలపైనే కొనసాగిస్తుండగా, ఖాళీగా ఉన్న వాటితో కలిపి మొత్తం బల్దియాకు ఏడాదికి 50 నుంచి 60 కోట్ల ఆదాయం నష్టపోతుంది. అయినా ఉన్నతాధికారులు లైట్‌గా తీసుకుంటున్నారు.
ఖైరతాబాద్ జోన్లో..
ఈ జోన్ లోని అబిడ్స్ మున్సిపల్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం 24 షాపులు ఉండగా, ఒక్కో దాన్నుంచి నెలకి వెయ్యి నుంచి 10 వేల వరకు రెంటు వస్తుంది. మరో10 షాపులు ఖాళీగా ఉన్నాయి. వీటిని 1994లో అలాట్మెంట్చేయగా, కొన్నింటి లీజు గడువు 1 జనవరి 1997లో, మరికొన్నింటి లీజు నవంబర్ 9, 1997లో ముగిసినా అధికారులు అదే అద్దెకు మళ్లీ పాత వారికే అప్పగించారు. అదే బిల్డింగ్సెల్లార్లలో 50 షాపులు ఉండగా అన్నీ ఖాళీగానే ఉన్నాయి. వీటి ద్వారా ప్రస్తుతం 3 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదు. కోఠి బస్ డిపోలోని గ్రౌండ్ ఫ్లోర్లో 13 షాపులకు 3 ఖాళీగా ఉన్నాయి. మొదటి ఫ్లోర్లో ఉన్న12 షెటర్లలో 8 ఖాళీగా ఉన్నాయి. వీటి లీజు 28 మార్చి 2013 లోనే ముగిసినా పాత కిరాయితోనే నడుస్తున్నాయి.
సికింద్రాబాద్ జోన్లో..
ఈ జోన్‌పరిధిలో హరిహర కళాభవన్ లోని ఎస్పీ రోడ్డు వైపు13 షాపులుండగా, ఒక్కో దానికి రూ.4,200 నుంచి రూ.13,125 వేలు, ఆర్పీ రోడ్డు వైపు 4 షాపులకు ఒక్కోదానికి రూ. 12 వేల నుంచి రూ.68 వేలు, అలెగ్జాండర్ రోడ్డు వైపు6 షాపులకు ఒక్కో దానికి రూ.6,163 వేల కిరాయిలు వస్తాయి. వీటితో అదే బిల్డింగ్‌లో ఒకటి, మూడు, నాలుగో ఫ్లోర్లలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ కు లీజుకు ఇవ్వగా నెలకు రూ. 3 లక్షల 75 వేల అద్దె చెల్లిస్తుంది. 2, 5వ అంతస్తుల్లోని ఎన్టీపీసీ నెలకు రూ.32,03,925 అద్దె కడుతుంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సంస్థ లీజు 2010 మే 1 వ తేదీన పూర్తవగా, ఎన్టీపీసీ సంస్థ లీజు గడువు మార్చి 31, 2007లోనే ముగిసినా నేటికీ పాత అద్దెనే చెల్లిస్తున్నాయి. బుద్ధభవన్ లోనూ 34 షెటర్లు ఉండగా వీటిలో 3 షెటర్లు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ నెలకి రూ. 25 వేల వరకు అద్దె వస్తుంది. చిలకలగూడలోని మున్సిపల్ కాంప్లెక్స్ లో మొత్తం 72 షాపులు ఉండగా, వీటిలో ప్రస్తుతం 40 షాపులు ఖాళీగా ఉన్నాయి. మొదటి అంతస్తులోని 5 షాపులను అలాట్ చేసి అద్దె వసూలు చేస్తున్నారు.
చార్మినార్ జోన్లో..
ఈ జోన్లో అద్దెలు చాలా తక్కువగా ఉన్నాయి. మలక్‌పేట్‌లోని జీహెచ్ఎంసీ కాంప్లెక్స్ లో కేవలం ఒక్క షాపు నుంచి నెలకు ఒక లక్షా ఒక వెయ్యి 39 రూపాయల అద్దె వస్తుంది. అంటే మిగతా జోన్లలో తిరిగి టెండర్లు వేయకపోవడంతో అద్దెలు తక్కువగా వస్తున్నాయి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నిర్ణయించిన నామమాత్రపు ధరలను నేటికీ వసూలు చేస్తుండడంతో బల్దియా కోట్లలో ఆదాయం కోల్పోతుంది.