100 అడుగుల లోతు .. ఇంజక్షన్ బోర్లతో ఇంకుడు గుంతలు

100 అడుగుల లోతు .. ఇంజక్షన్ బోర్లతో ఇంకుడు గుంతలు

హైదరాబాద్, వెలుగు: వర్షపు నీటిని ఒడిసి పట్టి, గ్రౌండ్​వాటర్ ను పెంచేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఇంకుడు గుంతల నిర్మాణంపై స్పెషల్​ఫోకస్ పెట్టింది. అమృత్ స్కీమ్ కింద ‘షాలో ఆక్వి ఫర్ రీచార్జ్ ప్రాజెక్టు’ పేరుతో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రేటర్​పరిధిలోని ఐదు మేజర్ జీహెచ్ఎంసీ పార్కులను ఎంపిక చేసింది. వాటిలో 100 అడుగుల నుంచి 120 అడుగుల లోతున ఇంజక్షన్​బోర్ వెల్​వేసి, వర్షపు నీటిని అందులోకి పంపించే ఏర్పాట్లు చేస్తోంది. దాని చుట్టూ ఇంకుడు గుంతను నిర్మిస్తోంది. 

ఇప్పటికే కొన్ని పార్కుల్లో ఇంకుడు గుంతలు ఉండగా, అందులో బోర్​వెల్​తో డ్రిల్ చేస్తున్నారు. పైలట్​ప్రాజెక్టు చేపట్టిన ఐదు పార్కుల్లో వచ్చే రిజల్ట్​ను బట్టి మిగిలిన ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు తవ్వించాలని ప్లాన్​చేస్తున్నారు. సికింద్రాబాద్ జోన్ లోని ఇందిరా పార్క్, ఖైరతాబాద్ జోన్ లోని కేఎల్ఎన్ యాదవ్ పార్క్, శేరిలింగంపల్లి జోన్ లోని టెక్నో పార్క్, ఎల్బీనగర్ జోన్ హబ్సిగూడలోని కాకతీయ నగర్ కాలనీ పార్క్, సైనిక్ పురి ఈ–సెక్టార్ పార్కును పైలట్​ప్రాజెక్ట్​కింద ఎంపిక చేశారు.

రూ.20 లక్షల ఖర్చు

పైలట్​ప్రాజెక్టులో భాగంగా ఐదు పార్కుల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి జీహెచ్ఎంసీ రూ.19 లక్షల94వేల53 ఖర్చు చేస్తోంది. నిర్మాణ బాధ్యతలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ఒప్పంద ఎన్జీఓ అయిన అద్వా ఎన్వీరో సొల్యూషన్స్(ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు)కు అప్పగించింది. ఇంకుడు గుంతల నిర్మాణ పనుల కోసం ఇప్పటికే సదరు ఏజెన్సీకి రూ.7లక్షల97వేల571 అందించింది. మిగిలిన మొత్తాన్ని పనులు పూర్తిచేసిన తర్వాత అందించనుంది. నెలాఖరులోపు పైలట్ ప్రాజెక్టు పూర్తవుతుందని బల్దియా అధికారులు చెబుతున్నారు. వర్షా కాలంలో పడ్డ ప్రతి బొట్టును భూమిలోకి ఇంకించేందుకు ఈ ఇంకుడు గుంతలు ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు.

కాకతీయనగర్ కాలనీలో అవగాహన

ఎన్ఐయూఏ ప్రతినిధి, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ బృందంతో కలిసి మంగళవారం హబ్సిగూడలోని కాకతీయ నగర్ కాలనీ పార్కులో జీహెచ్ఎంసీ అధికారులు స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పైలట్​ప్రాజెక్టుతో కలిగే ప్రయోజనాలను వివరించారు. పార్కు వాటర్ షెడ్ ప్రాంతం 6,85,738 చదరపు మీటర్లు కాగా, వాటర్ షెడ్ సామర్థ్యం 44.6 కోట్ల లీటర్లు, వార్షిక వర్షపాతం 53 లక్షల లీటర్లుగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ డాక్టర్ సునంద రాణి తెలిపారు. ది రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ బృందం హెడ్ కల్పన పార్కులో చేపట్టిన ఇంకుడు గుంత నిర్మాణం, వాటర్​రీచార్జ్ తీరును వివరించారు. పార్కులోని ఇంకుడుగుంతతో పరిసర ప్రాంతాల్లోని గ్రౌండ్​వాటర్​లెవల్స్​మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూబీడీ డిప్యూటీ డైరెక్టర్ ఎం.చంద్రశేఖరరావు, ఎన్ఐయూఏ ప్రతినిధి అనిరుధ్ తదితరులు పాల్గొన్నారు.