- గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నో చెప్పిన కేటీఆర్
- డ్రైనేజీ సిస్టమ్ సెట్ చేసి కబ్జాలను తొలగిస్తమన్నరు
- చెరువులను బాగు చేసి వరద రానియ్యమన్నరు
- కానీ నాలుగేండ్లుగా పూడిక కూడా తీస్తలేరు
హైదరాబాద్, వెలుగు: చిన్న వాన పడితే చాలు నాలాలన్నీ పొంగుతాయి.. ఎక్కడ ఏ డ్రైనేజీ తెరిచి ఉంటుందో తెలియదు.. అడుగు తీసి అడుగేస్తే ప్రమాదం. కన్నుమూసి తెరిచేలోగా మృత్యువు కాటేస్తుంది. విశ్వనగరంగా మారుస్తామని పాలకులు చెప్తున్న హైదరాబాద్‌లో దుస్థితి ఇది. ఎన్నికలప్పుడు హామీల మీద హామీలు ఇచ్చే లీడర్లు.. ఎన్నికల తంతు ముగియగానే ఆ హామీలను అటకెక్కిస్తున్నారు. అధ్వాన్నంగా తయారైన రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్ సిటీ జనాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి.
వానా కాలం వస్తే కండ్ల ముందే ముంపు పొంచి ఉంటోంది. నాలుగైదు రోజుల్లోనే వానల వల్ల ఓపెన్‌నాలాలు పొంగి వరదల ప్రవాహం పెరిగి ఇద్దరు మృత్యువాతపడ్డారు. నేరేడ్మెట్లోని దీన్‌దయాల్‌నగర్‌లో 11 ఏండ్ల సుమేధ, సరూర్‌నగర్‌లోని తపోవన్ కాలనీ వద్ద నవీన్‌కుమార్ ప్రాణాలు వదిలారు.
ఎన్నో హామీలిచ్చిన కేటీఆర్.. కానీ!
రాష్ట్రం ఏర్పాటయ్యాక మంత్రి కేటీఆర్ 2016 జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా ఎన్నో హామీలు ఇచ్చారు. నాలాలను విస్తరిస్తామని, వాటిపై కబ్జాలు తొలగిస్తామని, చెరువులను సుందరీకరిస్తామని, వరద నీటి ప్రవాహానికి నియంత్రణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కానీ నాలుగేండ్లలో నాలాల్లోని చెత్తను కూడా ప్రభుత్వం తొలగించలేకపోయిందన్న విమర్శలున్నాయి. 100 రోజుల ప్రణాళికల్లో ప్రధానాంశంగా ఉన్న నాలాల బ్యూటిఫికేషన్ కాగితాలకే పరిమితమైంది. సిటీ చుట్టూ 400 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న నాలాలను విస్తరించాలని 2017లో కేటీఆర్ రివ్యూ చేశారు. 28 వేల ఆక్రమణలను గుర్తించగా తర్వాత మరోసారి స్టడీ చేసి 12వేల నిర్మాణాలే ఆక్రమణలుగా తేల్చారు. వాటిని ఇప్పటికీ ఎందుకు తొలగించలేదని జనం ప్రశ్నిస్తున్నారు.
కనీసం ఫెన్సింగ్ కూడా లేదు
చాలా ప్రాంతాల్లో నాలాల వెంట కనీసం రక్షణ గోడలు లేవు. ఫెన్సింగ్ లేదు. నేరేడ్మెట్లోని సంతోషిమా నగర్, దీన్‌దయాల్‌నగర్, కాకతీయనగర్.. ఇలా చాలా ప్రాంతాల్లో ఇండ్ల మధ్య ఎక్కడ నాలాలు ఓపెన్‌గా ఉంటున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా ఆఫీసర్లు చర్యలు తీసుకొని వదిలేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. చాలా నాలాల్లో పూడిక పేరుకుపోయి డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.
మూలకు పడ్డ స్టడీలు
అస్తవ్యస్తంగా ఉన్న సిటీ స్ట్రోమ్ వాటర్ సిస్టం ను ఆధునీకరించేందుకు దశాబ్దాలుగా ఎన్నో స్టడీలు జరిగాయి. వాటి తాలూకు రిపోర్టులు బల్దియా, ప్రభుత్వం వద్ద ఉన్నాయి. క్లిరోస్కర్, ఓయెంట్స్ వంటి సంస్థలు, జేఎన్టీయూ వంటి వర్సిటీలు నగరంలోని వరద నీటి నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థలను స్టడీ చేసి రూ. 10 వేలకోట్లు ఖర్చుతో అంతా సెట్‌రైట్ చేయొచ్చని చెప్పాయి. కానీ వాటిని ప్రభుత్వం పక్కన పడేసిందన్న విమర్శలు ఉన్నాయి.
వందల కోట్లు ఖర్చు పెట్టి..!
గతేడాదిలో గ్రేటర్ హైదరాబాద్‌లో వరద ముంపును నివారించేందుకు రూ. 102 కోట్లతో 439 పనులు చేపట్టి నాలాల ఆధునీకరించినట్లు జీహెచ్ఎంసీ చెప్పింది. రూ. 596 కోట్లతో రోడ్లపై గుంతలు పూడ్చడం వంటి పనుల చేపట్టినట్లు పేర్కొంది. కానీ వారం రోజులుగా కురుస్తున్న వానలకు నగరంలో ఏ డివిజన్ లో చూసినా నీట మునిగే కాలనీలు, వరద నీరు ప్రవహిస్తున్న రోడ్లే కనిపిస్తున్నాయి.