- నాలాల నుంచి మ్యాన్‌హోల్స్ వరకు సమస్యలే
- మంత్రి కేటీఆర్ చెప్పినా పనులు సాగట్లే
- అధికారులు ఏం చేస్తున్నరో తెలియట్లే
“మల్కాజిగిరిలోని సర్దార్ పటేల్ నగర్ లో నాలా విస్తరణ పనుల కోసం గతేడాది బల్దియా శాంక్షన్ఇచ్చిన కూడా పనులు ఇంకా మొదలు కాలేదు. కిందటేడు వర్షాలు కురిసిన సమయంలో చాలా కాలనీలు నీట మునిగాయి. మళ్లీ వానాకాలం వస్తుండగా పనులు ఇంకా చేపట్టకపోతుండగా స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ’’
హైదరాబాద్, వెలుగు: మరో రెండు వారాల్లో వానాకాలం షురూ కానుంది. సిటీలో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ఇంకా రెడీ కాలేదు. బల్దియా, వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ, హెల్త్ ఇతర శాఖలైతే మేల్కొనలేదు. త్వరగా పనులు పూర్తిచేయకుంటే కురిసే వర్షాలతో ఈసారి కూడా జనానికి ఇబ్బందులు తప్పేలాలేవు. వచ్చే వానాకాలంలోపు సిటీలో నాలాల నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పినా ఆ దిశగా పనులైతే జరగట్లేదు. డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేస్తామన్నా దానిపైన దృష్టినే పెట్టలేదు. కనీసం మరమ్మతులకు గురైన మ్యాన్ హోల్స్ కవర్లు కూడా మార్చలేదు. కలుషిత నీటిపైనా ఏం చర్యలు తీసుకుంటున్నరో తెలియట్లేదు. ఎలక్ట్రిసిటీకి పనులు కూడా స్లోగానే నడుస్తుండగా, విద్యుత్ వైర్లకు ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలను కూడా తొలగించలేదు. ఇలా యాక్షన్‌ప్లాన్‌లో చేపట్టాల్సిన పనులన్నీ ఎక్కడివక్కడే ఉండిపోయాయి.
బల్దియాదే కీ రోల్
మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అమలులో బల్దియాదే కీ రోల్. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత దీనిపైనే ఉంది. గ్రేటర్ లోని 37 నాలాల పనులను మొదలుపెట్టినట్టు చెబుతున్న అధికారులు వానాకాలంలోపు పూర్తి చేసేలా కనిపించట్లేదు. ఎస్ఎన్డీపీ ని ఏర్పాటు చేసినా పనులు నెమ్మదిగానే నడుస్తుండగా, కనీసం నాలాల పూడికతీత పనులైనా జరగట్లేదు. కొన్ని నాలాల్లో ఐదారుఫీట్ల ఎత్తున చెట్లు పెరిగాయంటే అధికారులు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. నాలాల్లో రాళ్లు, ప్లాస్టిక్, మట్టితో నిండినా పూడితతీత పనులైనా చేపట్టలేదు. నాలుగురోజుల కిందట కలాసీగూడలో నాలాల పూడికతీత చేయకుండా కేవలం గోడపక్కన ఉన్న మట్టిని తొలగించి మధ్యలో పోసి వదిలేశారు. రోడ్లు కరాబ్అయిన ఏరియాల్లో కొత్తగా వేయట్లేదు. ఇతర పనుల కోసం కట్ చేసిన రోడ్లది అదే పరిస్థితి. వానలు పడితే ఆ గుంతలు మరింత పెద్దగా ఏర్పడతాయి. ఇలా ఏ విషయాన్ని బల్దియా అధికారులు సరిగా పట్టించుకోవట్లేదు.
వాటర్ బోర్డు కూడా అంతే..
వాటర్ సరఫరా, మురుగు తొలగింపులోనూ ప్రతి ఏడాది వాటర్‌బోర్డు ఫెయిల్అయితనే ఉంది. ఇప్పటికే మ్యాన్ హోల్స్పొంగిపొర్లుతుంటే కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. వాటర్‌బోర్డుకు వచ్చే వందల కంప్లయింట్లలో మ్యాన్ హోల్స్‌కి సంబంధించినవే ఎక్కువ. కొన్ని రకాల మ్యాన్ హోల్స్కవర్లు కూడా లేకపోవ డంతో డ్యామేజ్ అయినచోట కూడా ఏర్పాటు చేయలేకపోతుంది. కలుషిత నీటిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టకపోగా, బోర్డు ట్విట్టర్ ఖాతాకు వందల్లో కంప్లయింట్లు వెళ్తున్నాయి. గుట్టల బేగంపేట్, లంగర్ హౌజ్ ప్రాంతాల్లో వందమందికిపైగా హాస్పిటల్పాలైనా కూడా ఆయా ప్రాంతాల్లో నూ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేయాల్సి ఉండగా అధికారులు ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉందంటే వర్షాకాలమొస్తే ఏ విధంగా ఉంటుందో చూడాలి.
30 శాతమైనా చేయలె..
ఈదురు గాలులు, కురిసే వర్షాలకు చెట్ల కొమ్మలుకరెంటు తీగలపై పడి గంటల తరబడి విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుంది. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. ప్రతిసారి పనులకు టెండర్లు వేసి కాంట్రాక్టర్లకు అప్పగించి ఆ తర్వాత ఏం చేస్తున్నారన్న దానిపై సరిగా దృష్టిపెట్టకనే ఇబ్బందులు వస్తున్నాయి. వర్షాకాలం వస్తున్నా కూడా ఇప్పటికి 30 శాతం పనులైనా పూర్తి చేయలేదు. ట్రాన్స్ఫార్మర్లకు ఎలాంటి ఫెన్సింగ్లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశముంది. ప్రస్తుతం గ్రేటర్‌లోని ట్రాన్స్ఫార్మర్లలో 30 నుంచి 40 శాతం ప్రమాదకరంగానే ఉన్నాయి.
వైద్యారోగ్యశాఖ ముందస్తు చర్యల్లేవ్..
గ్రేటర్ పరిధిలోకి వచ్చే 3 జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ రూపొందించలేదు. వానలు పడినప్పుడు రోగాలు వచ్చే అవకాశం ఉండగా ప్రత్యేక ప్లాన్చేయలేదు. గడిచిన రెండేండ్లుగా పూర్తిగా కరోనా సేవలకే పరిమితమైన హెల్త్ సెంటర్లు ఇప్పుడిప్పుడే అన్నిరకాల సేవలు అందిస్తున్నాయి. అప్పటి నుంచి మాన్సూన్పై పెద్దగా దృష్టి పెట్టని వైద్యారోగ్యశాఖ ఈసారి ఏవిధమైన చర్యలు తీసుకోవాలనే దానిపై ఇంకా ప్లాన్ అయితే చేయలేదు. మలేరియా, డెంగీ పై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరముంది.
ఏం పనులు చేయట్లే..
మాన్సూన్ప్లాన్ పై రాష్ట్ర ప్రభుత్వం, బల్దియా, వాటర్ బోర్డు ఫెయిల్అయ్యాయి. నాలాల నిర్మాణం చేస్తామని మంత్రులు ఇచ్చిన హామీ ఏమైంది ? వరదల సమయంలో ఇచ్చిన వాటినే పరిష్కరించలేదు. అండర్ డ్రైనేజీ పనులు అసలు జరగట్లేదు. వానాకాలంలో జనానికి ఇబ్బందులు తప్పేలా లేవు.
- శ్రావణ్, మల్కాజిగిరి కార్పొరేటర్
పనులు కొనసాగిస్తున్నం..
వచ్చే వర్షాకాలంలో జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగిస్తున్నాం. వరదలు వస్తే సాఫీగా నీరు వెళ్లేలా పనులు చేస్తున్నం. ఎంత పెద్ద వానలు పడినా తట్టుకునేలా పనులు చేపడుతున్నాం. త్వరలోనే పూర్తి చేస్తాం.
- కిషన్, సీఈ, ఎస్ఎన్ డీపీ
ప్లాన్ చేస్తున్నం
వానాకాలానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ చేస్తున్నం. మలేరియా, డెంగీ, డయేరియా తదితర వ్యాధుల కోసం ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అవసరమైతే ప్రత్యేకంగా క్యాంపులు కూడా నిర్వహిస్తాం. జనాలు వ్యాధుల బారిన పడకుండా తగు చర్యలు తీసుకుంటాం.
- డాక్టర్ వెంకటి,
డీఎంహెచ్‌వో, హైదరాబాద్