- ఒక్కో సర్కిల్ కు 20 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు
- గ్రేటర్ పరిధిలో లక్షల్లో వ్యాపారాలు.. వేలల్లో ట్రేడ్ లైసెన్స్‌లు
- లైసెన్స్ లేనివారిపై సీరియస్యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌పరిధిలో మరోసారి ట్రేడ్‌లైసెన్స్ డ్రైవ్ నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. లైసెన్స్ ఫీజు ఎగ్గొడుతున్న వ్యాపారులపై సీరియస్యాక్షన్తీసుకోవాలని నిర్ణయించింది. 2022 తరహాలో స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి ఆదాయం పెంచుకోవాలని చూస్తోంది. సిటీ వ్యాప్తంగా లక్షల్లో వ్యాపారాలు కొనసాగుతుంటే ట్రేడ్‌లైసెన్స్ లు మాత్రం లక్ష లోపు ఉన్నాయి. వేల మంది ట్రేడ్ లైసెన్స్ లు తీసుకోకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గ్రేటర్లని 2.60 లక్షల కమర్షియల్ ప్రాపర్టీలను విజిట్ చేయాలని బల్దియా అధికారులు నిర్ణయించారు. వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి, ట్రేడ్ లైసెన్స్ లు ఉన్నాయో? లేదా చెక్ చేయనున్నారు. ట్రేడ్ లైసెన్స్ లేకపోతే పెనాల్టీలు వేయడంతోపాటు వెంటనే ఫీజులు కలెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం సింగిల్ రోడ్డు పక్కన ఉన్న చోట స్క్వైర్ ఫీటుకి రూ.3, డబుల్ రోడ్డు ఉన్నచోట రూ.4, నాలుగు లేన్లకి మించి మెయిన్‌రోడ్డు పక్కన అయితే రూ.6 కలెక్ట్చేస్తున్నారు.
సర్కిల్ స్థాయిలో స్పెషల్టీమ్స్
ట్రేడ్ లైసెన్స్ ఫీజును పక్కాగా కలెక్ట్ చేసేందుకు సర్కిల్ స్థాయిలో టీమ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మాదిరిగానే ఒక్కో సర్కిల్ కి 20 టీమ్స్ ని నియమిస్తున్నారు. కొత్తగా వ్యాపారం స్టార్ట్చేస్తున్నవారిలో కొందరు ట్రేడ్లైసెన్స్తీసుకోవడం లేదు. పాతవారు రెన్యువల్ చేసుకోవడంలేదు. వీరిపై బల్దియా అధికారులు ప్రస్తుతం ఫోకస్‌పెట్టారు. గతంలో చేపట్టిన స్పెషల్‌డ్రైవ్‌తో జీహెచ్ఎంసీకి ఆదాయం పెరిగింది. 2018–19 లో ట్రేడ్ లైసెన్స్ ల ద్వారా రూ.32 కోట్లు వచ్చింది. ఈ ఏడాదిలో జనవరి నుంచి ఇప్పటి వరకు రూ.82 కోట్లు వచ్చింది. ఉన్నతాధికారులు ట్రేడ్ లైసెన్స్ జారీపై ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహించి చర్యలు తీసుకుంటే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. గ్రేటర్‌పరిధిలో దాదాపు 2 లక్షల మంది వ్యాపారులు ఉన్నారు. వీరి నుంచి పక్కాగా లైసెన్స్ ఫీజు కలెక్ట్ చేస్తే రూ.200 కోట్లు దాటే అవకాశాలున్నాయి.
2018 నుంచి ఇప్పటివరకు ట్రేడ్‌లైసెన్స్ ల వివరాలు
ఏడాది ట్రేడ్ లైసెన్స్ లు ఆదాయం(రూ.కోట్లలో)
2018–19 40,422 32.91
2019–20 39,501 34.47
2020–21 31,166 32.63
2021–22 34,813 46.37(మార్చి నుంచి డిసెంబర్)
2022 74,561 72.15(జనవరి నుంచి డిసెంబర్)
2023 1,06,333 81.92(జనవరి నుంచి డిసెంబర్)
2024 89,209 82.14(ఈ నెల11 వరకు)