
- చార్మినార్, మలక్పేట, జూబ్లీ హిల్స్, మెహిదీపట్నం ఆఫీసర్లకు జారీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ రోడ్లపై చెత్త వేస్తున్న వారికి చలాన్లు వేయడంలో నిర్లక్ష్యం వహించిన నలుగురు అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ రెండు రోజుల క్రితం మెమోలు జారీ చేశారు. రోడ్లపై చెత్త, నిర్మాణ వ్యర్థాలు వేస్తున్న వారిని గుర్తించి వారికి ఫైన్లు వేసేందుకు జీహెచ్ఎంసీ సీసీఎంఎస్ (కాంప్రెహెన్సివ్ చలాన్మేనేజ్ మెంట్ సిస్టం) గత నెల అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా మొదటి 10 రోజుల్లో రూ.500 నుంచి రూ.25 వేల వరకు ఫైన్లు వేసి, రూ.10 లక్షల వరకు రాబట్టారు. అత్యధికంగా నిర్మాణ వ్యర్థాలు రోడ్లపై వేస్తున్న 37మందికి రూ.5.50 లక్షలు, రోడ్లపై చెత్త వేస్తున్న 222 మందికి రూ.5,41,200 ఛలాన్లను టౌన్ప్లానింగ్అధికారులు వేశారు. రాను రాను అధికారుల్లో ఉత్సాహం తగ్గడంతో ఫైన్లు వేయడం మానేశారు.
దీంతో ఈ విషయం తెలిసిన కమిషనర్ఎవరెవరు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారో తెలుసుకున్నారు. చార్మినార్, మలక్ పేట, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు(ఏఎంఓహెచ్) జ్యోతీ బాయి, శ్రీనివాస్, రవి, ఇర్షత్ ఇక్బాల్కు మెమోలు జారీ చేశారు. రోజూ ఈ విషయంపై దృష్టిపెడుతానని, మార్పు కనిపించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.