
- 6 నుంచి 16 ఏళ్ల లోపు వారికి ట్రైనింగ్
- వెయ్యి మంది హానరరీ కోచ్ లను తీసుకోనున్న జీహెచ్ఎంసీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ నెల 25 నుంచి జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపులు ప్రారంభం కానున్నాయి. ఈ క్యాంపుల్లో ప్రతిఏటా మాదిరిగానే 44 రకాల క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ను వివిధ గ్రౌండ్లలో ఆరేండ్ల నుంచి 16 ఏండ్లలోపు పిల్లలకు ఇవ్వనున్నారు. గతేడాది సమ్మర్ క్యాంపుల్లో లక్షమంది వరకు శిక్షణ పొందగా, ఈసారి అంతకు రెట్టింపు సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
శిక్షణ ఇచ్చేందుకు వెయ్యి మంది వరకు హానరరీ కోచ్(వేతనం లేకుండా) లను కూడా తీసుకోనున్నారు. కోచింగ్ ఇచ్చినందుకు వీరికి ఒక ట్రాక్ షూట్, షూస్ఇవ్వనున్నారు. ఈ నెల 25న పెద్దగా హడావిడి లేకుండా క్యాంపులు మొదలుపెట్టనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఈ నెల 29వరకు అమల్లో ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులు మాత్రమే క్యాంపులను
స్టార్ట్ చేయనున్నారు.
వచ్చేవారం నుంచి అప్లయ్ చేసుకోవచ్చు
సమ్మర్ క్యాంపులకి సంబంధించి వచ్చేవారం నుంచి అప్లికేషన్లను ఆన్ లైన్ ద్వారా తీసుకోనున్నారు. ఆసక్తిగల విద్యార్థులు https://sports.ghmc.gov.in/ వెబ్ సైట్ లో పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. క్యాంపుల్లో పాల్గొనే వారు జీహెచ్ఎంసీ పోర్టల్ లో నమోదు చేసుకొని ఫీజు చెల్లించాల్సి ఉంది. షటిల్, బ్యాడ్మింటన్, రోలర్ స్కేటింగ్, క్రికెట్, టెన్నిస్ కు రూ. 50, మిగతా క్రీడలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ మెటీరియల్ కోసం దాదాపు రూ.1.20 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు.
44 రకాల క్రీడలకు శిక్షణ
సమ్మర్ క్యాంపుల్లో భాగంగా అథ్లెటిక్స్, ఆర్చరీ, బాల్ బాడ్మింటన్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాక్సింగ్, క్రికెట్, చెస్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్ బాల్, జిమ్నాస్టిక్, హాకీ, హ్యాండ్ బాల్, జూడో, కరాటే, కబడ్డీ, ఖోఖో, కార్ఫ్ బాల్, మాల్ కంబా, నెట్ బాల్, రోలార్ స్కేటింగ్, సాఫ్ట్ బాల్, స్విమ్మింగ్, సెపక్ తక్రా, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, టెన్నికైట్, థైక్వాండో, తగఫ్ వార్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెస్లింగ్ ఇండియన్, రెస్లింగ్ రోమన్, ఉషు, యోగా, త్రో బాల్, కిక్ బాక్సింగ్, మయ్ థాయ్, స్కే మార్షల్ ఆర్ట్స్, మినీ ఫుట్ బాల్, క్యారమ్స్ గేమ్స్ పై కోచింగ్ ఇవ్వనున్నారు.