- రూ.వెయ్యి ఫైన్ వేస్తామంటూ వార్నింగ్
- ఉప్పల్లో లిట్టర్ కంట్రోల్ కాషన్ కెమెరాతో సమస్యకు చెక్
హైదరాబాద్ సిటీ/ఉప్పల్, వెలుగు:గార్బేజ్వల్నరబుల్ పాయింట్ల(జీవీపీ)ను తొలగించేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నాలు చేస్తోంది. రోడ్లపై వేస్తున్న చెత్తను తొలగిస్తున్నా మళ్లీ మళ్లీ వేస్తుండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. జీవీపీల వద్ద గతంలో డస్ట్ బిన్లు ఉండేవి. నాలుగేండ్ల కింద డస్ట్ బిన్ లెస్ సిటీగా మార్చేందుకు అధికారులు వాటిని తొలగించారు. అయితే డబ్బాలు లేపోయినా, స్థానికులు జీవీపీ పాయింట్ల వద్దనే చెత్తను వేస్తున్నారు.
జీవీపీలను ఎత్తివేసి అందరూ స్వచ్ఛ ఆటోల్లోనే వేసేలా చర్యలు తీసుకోవాలనుకున్నప్పటికీ ప్రజల నుంచి సహకారం లభించలేదు. జీవీపీల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఎల్బీనగర్ జోన్ ఉప్పల్ సర్కిల్లో టెక్నాలజీని వాడుకుంటోంది. చెత్త వేస్తున్న చోట జీహెచ్ఎంసీ లిట్టర్ కంట్రోల్ కాషన్ కెమెరా, ఆ పక్కనే మైక్ ఏర్పాటు చేసింది.
జీవీపీ వద్ద ఎవరైనా చెత్త వేయడానికి వస్తే కెమెరా గుర్తుపట్టి ‘హలో హలో.. మిమ్మల్ని గమనిస్తున్నా.. ఇక్కడ చెత్త వేస్తే రూ.1000 ఫైన్ వేస్తాం’ అని హెచ్చరిస్తోంది. దీంతో చెత్త వేయడానికి వచ్చేవారు చెత్తను పట్టుకుని మళ్లీ ఇంటిదారి పడుతున్నారు. ఉప్పల్సర్కిల్లోని పిస్తాహౌస్తోపాటు మరో 19 ప్రాంతాల్లో ఈ పద్ధతిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సక్సెస్అయితే, సిటీ అంతా అమలు చేయాలని చూస్తున్నారు.