వర్షాకాలం నేపథ్యంలో సిటీలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. మాన్ సూన్ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా 290 టీమ్ లు ఏర్పాటు చేసింది. వర్షం పడినప్పుడు రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ప్రత్యేక బృందాలు చర్యలు తీసుకోనున్నాయి. ఈ బృందాలు డీసీఎం వ్యాన్లు, జేసీబీలు వినియోగించనున్నాయి. వాటర్ పంపులు, ట్రీ కట్టర్లు సహా వివిధ పరికరాలను అందుబాటులో ఉంచుకోనున్నాయి. ఫిర్యాదు అందిన చోటికి వెంటనే వెళ్లేలా బృందాలు పనిచేయనున్నాయి. వాతావరణ శాఖ తో సమన్వయం చేసుకుని ఎక్కడ వర్షం ఎక్కువ పడుతుందనే సమాచారం ముందే తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో ఎక్కువ బృందాలను మోహరించనున్నారు. మాన్ సూన్ యాక్షన్ ప్లాన్ అమలు కోసం సుమారు రూ.23 కోట్లు వెచ్చిస్తున్నారు. సమస్య తలెత్తితే ప్రజలు వెంటనే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా 040–-211-1111 ఫోన్ నెంబరును కేటాయించారు. దీంతోపాటు ‘మై జిహెచ్ఎంసి’ యాప్ లో ఫిర్యాదును అప్ లోడ్ చేసే సౌకర్యం కల్పించారు. గతేడాది వర్షాకాలంలో రోడ్ల మరమ్మతులు, గుంతల పూడ్చివేత, నాలాల్లో పూడికతీత పనులు సరైన సమయంలో పూర్తి చేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తాయి. ఈసారి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
లోతట్టు ప్రాంతాల గుర్తింపు
నగరంలో ఆకస్మిక, భారీవర్షాల వల్ల 147 ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం వీటిలో 37 ప్రాంతాల్లో నీరు నిల్వకుండా పనులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 110 ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. రైల్వే అండర్ బ్రిడ్జిలు, వాగులు కలిసే ప్రాంతాలు, మలుపుల వద్ద నీటి నిల్వలు ఏర్పడే ప్రాంతాలుగా గుర్తించారు. గ్రేటర్ పరిధిలో రూ. 390 కోట్ల వ్యయంతో 802 లేన్ కిలోమీటర్ల రోడ్లను పిరియాడికల్ ప్రివెన్షన్ మెయింటనెన్స్ (పి.పి.ఎం) కార్యక్రమంలో భాగంగా చేపట్టిన బీటీ కార్పెటింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇటీవల కమిషనర్ ఆదేశించారు.
సమన్వయ సమావేశంలో బల్దియా తీసుకున్న నిర్ణయాలు
- జూన్ రెండో వారం నుంచి వర్షాకాలం ప్రారంభం కానున్నందున నగరవాసులకు ఇబ్బందులు కలుగకుండా మే 31వ తేదీ నుంచి నగరంలో అన్ని రకాల రోడ్డు తవ్వకాలపై నిషేధం అమలు చేస్తున్నారు.
- అన్ని రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణ పనులన్నింటిని త్వరగా పూర్తిచేయాలి.
- నగరంలో ఇప్పటికే చేపట్టిన మ్యాన్‌హోళ్ల పున: నిర్మాణం పనులను యుద్ధ ప్రాతిపదికపై పూర్తిచేయాలి.
- వర్షాకాల విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నగరంలోని ప్రతి శాఖ ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని
నియమించాలి. - ప్రతి విభాగం ఆధ్వర్యంలో ఉన్న విపత్తుల నివారణ బృందాల వివరాలను జీహెచ్ఎంసీ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగానికి అందజేయాలి.
- భారీ వర్షాల వల్ల రోడ్లపై చెట్లు, భారీ వృక్షాలు కూలి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ రహదారులను గుర్తించాలి.
- నగరంలో వర్షాకాలం సందర్భంగా ఐదు సెంటీమీటర్లకు పైగా ఆకస్మిక వర్షాలు కురిసి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి అయితే ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోకి తక్షణమే తరలించేందుకు వీలుగా ప్రతి వార్డులో కమ్యునిటీ హాళ్లు, పాఠశాలలు, ఖాళీ స్థలాలను
గుర్తించాలి. - వర్షాకాల ప్రవేశానికి ముందే రోడ్లపై ఉన్న గుంతలు, మరమ్మతులను పూర్తిచేయాలి.