- తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎలక్షన్
- జీహెచ్ఎంసీ ఆఫీసు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- పాసులు ఉన్న వారికి మాత్రమే లోపలికి పర్మిషన్
- తమ మెంబర్లకు విప్ జారీ చేసిన రాజకీయ పార్టీలు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ కొత్త పాలక మండలి కొలువుదీరేందుకు సర్వం సిద్ధమైంది. కొత్త మెంబర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎలక్షన్‌కు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మెంబర్లంతా గురువారం పొద్దున 10.45 గంటలకల్లా కౌన్సిల్ హాల్‌కు రావాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 11 గంటలకు కొత్త మెంబర్ల ప్రమాణ స్వీకారం మొదలవుతుంది. ఈ కార్యక్రమం ముగిశాక మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక చేపడతారు. ఈ ఎన్నిక కోసం అన్ని పార్టీలు బుధవారమే విప్ జారీ చేశాయి. కొత్త కౌన్సిల్ ఫస్ట్ మీటింగ్‌కు మొత్తంగా 149 మంది కార్పొరేటర్లు, 44 మంది ఎక్స్ అఫీషియో మెంబర్లు హాజరుకావాల్సి ఉంది. కొత్త కౌన్సిల్, మేయర్ ఎన్నిక నేపథ్యంలో గురువారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసు పరిసర ప్రాంతాల్లో పొద్దున 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. పాసులు ఉన్న వారిని మాత్రమే జీహెచ్ఎంసీ ఆఫీసులోకి అనుమతించనున్నారు. కాగా.. జీహెచ్ఎంసీ కొత్త కౌన్సిల్ మీటింగ్, ఎలక్షన్ కోసం చేసిన ఏర్పాట్లను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి బుధవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
విప్‌లు జారీ..
మేయర్ ఎన్నిక కోసం అన్ని పార్టీలు తమ కార్పొరేటర్లకు విప్ జారీ చేశాయి. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, బీజేపీ నుంచి గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్, ఎంఐఎం నుంచి ఎమ్మెల్యే పాషా ఖాద్రీలు విప్ లుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు వారు ఎలక్షన్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌కు పేపర్స్ సమర్పించారు. ఎవరైనా కార్పొరేటర్, మెంబర్ తమ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేస్తే.. పదవిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే వారు వేసిన ఓటు మాత్రం చెల్లుబాటు అవుతుంది.
చెయ్యి ఎత్తడం ద్వారా ఓటింగ్..
కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో మెంబర్లు తమకు అందిన నోటీసు (ఆహ్వానం)తో మీటింగ్‌కు రావాలి. మొదట కొత్త మెంబర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ లాంగ్వేజీల్లో ప్రమాణ పత్రాలను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాక పన్నెండున్నర, ఒంటిగంట టైంలో తొలుత మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. మేయర్ క్యాండిడేట్‌ను కౌన్సిల్లోని ఒక మెంబర్ ప్రపోజ్ చెయ్యాలి. మరో మెంబర్ సపోర్ట్ చెయ్యాలి. క్యాండిడేట్లు ఎవరెవరో తేలాక.. మెంబర్లు చెయ్యి పైకెత్తడం ద్వారా ఓటింగ్ ఉంటుంది. ఎవరికి అనుకూలంగా ఎందరు చేతులెత్తారో లెక్కించి విజేతను ఖరారు చేస్తారు. తర్వాత ఇదే పద్ధతిలో డిప్యూటీ మేయర్ ఎలక్షన్ నిర్వహిస్తారు. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎలక్షన్ నిర్వహించాలంటే.. కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియోలు సహా మొత్తం మెంబర్లలో కనీసం 50 శాతం మంది మీటింగ్‌కు హాజరవ్వాలి. దీనినే కోరం అంటారు. కోరం లేకుంటే మరుసటి రోజుకు ఎలక్షన్ వాయిదా వేస్తారు. తర్వాతి రోజూ కోరం లేకుంటే.. ఎలక్షన్ కమిషన్ సూచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు.
కొవిడ్ గైడ్‌లైన్స్ ఎక్కడ?
జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్‌లో సీట్ల ఏర్పాటు కొవిడ్ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా ఉంది. ఒక్కో టేబుల్‌కు 2 సీట్లు ఉండగా.. ఫిజికల్ డిస్టెన్స్‌ను పక్కన పెట్టి రెండింటినీ మెంబర్లకు కేటాయించారు. మెంబర్లు హాల్లోకి వచ్చే టైంలో మాస్కు, శానిటైజర్ అందించనున్నారు.