- ఇండ్లతోపాటు పరిసరాలను, సిటీని క్లీన్‌గా ఉంచాలి
- త్వరలో జీవీపీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం
- చెత్త పారబోస్తున్నవారిని గుర్తించి ఫైన్లు వేస్తాం
- జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి స్పష్టం
- ఖైరతాబాద్‌లో ‘స్వచ్ఛదనం- పచ్చదనం’ కార్యక్రమానికి శ్రీకారం
హైదరాబాద్, వెలుగు: రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధిస్తామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. సోమవారం ఆమె ఖైరతాబాద్ జోన్ ఎన్ బీటీ నగర్ లో కమిషనర్ఆమ్రపాలి, జోనల్కమిషనర్అనురాగ్మహంతితో కలిసి ‘స్వచ్ఛదనం–- పచ్చదనం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. రోడ్లపై చెత్త వేయొద్దని, ఇండ్ల ముందుకు వచ్చే స్వచ్ఛ ఆటోలకు అందించాలని సూచించారు. గార్బేజ్వల్నరబుల్పాయింట్ల(జీవీపీ)ను ఉదయం క్లీన్చేస్తే.. సాయంత్రానికి మళ్లీ చెత్తతో నిండిపోతున్నాయని చెప్పారు. చదువుకున్నోళ్లే రోడ్లపై చెత్త తెచ్చి పోస్తున్నారని, ఇండ్లతోపాటు పరిసరాలను క్లీన్‌గా ఉంచుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ను క్లీన్‌సిటీగా మార్చేందుకు సహకరించాలని కోరారు.
త్వరలో జీవీపీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. చెత్త తెచ్చిపోస్తున్నవారిని గుర్తించి ఫైన్లు వేస్తామని హెచ్చరించారు. జీవీపీల ఎత్తివేతకు, హెల్దీ సిటీగా మార్చేందుకు జనం సహకరించాలని కోరారు. స్వచ్ఛదనం, పచ్చదనం అందరి బాధ్యత అని చెప్పారు. సిటీలో 4 వేలకు పైగా స్వచ్ఛ ఆటోలతో చెత్త సేకరణ జరుగుతోందని, అయినప్పటికీ చాలా మంది ఇండ్లలోని చెత్తను బయట పోస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చినప్పుడే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. కమిషనర్ ఆమ్రపాలి మాట్లాడుతూ.. స్వచ్ఛదనం– పచ్చదనంలో భాగంగా ఈ నెల 9 వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. నగర ప్రజలు రోడ్లపై చెత్త వేయడం మానుకోవాలన్నారు. దోమలు, సీజనల్వ్యాధుల నియంత్రణకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. చిన్నపిల్లలను షాపులకు పంపొద్దని, కుక్కల బారిన పడకుండా చూడాలని సూచించారు. వీధి కుక్కలకు స్టెరిలైజ్ చేస్తున్నామని చెప్పారు. త్వరలో స్పెషల్యాప్ ను తీసుకురాబోతున్నట్లు ఆమె వెల్లడించారు. స్టెరిలైజేషన్ చేసిన కుక్కల చెవులు కట్ చేసి ఉంటాయని చెప్పారు. ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, చీఫ్ ఎంటమాలజీ డాక్టర్ రాంబాబు పాల్గొన్నారు.