హైదరాబాద్ చికెన్ మార్కెట్​లో ఏంటీ రోత..!

హైదరాబాద్ చికెన్ మార్కెట్​లో ఏంటీ రోత..!
  • న్యూ మోతీనగర్​ ఏపీసీ మార్కెట్​ను తనిఖీ చేసిన జీహెచ్ఎంసీ మేయర్
  • అపరిశుభ్రంగా ఉండడంతో వెంటనే సీజ్ చేయాలని ఆదేశం
  • మార్కెట్ ​నిర్వాహకులతోపాటు మెడికల్ ఆఫీసర్​పై తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్ సిటీ, వెలుగు: నాణ్యతా ప్రమాణాలు పాటించని నాన్ వెజ్ విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్​ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. స్థానికుల ఫిర్యాదుతో న్యూ మోతీనగర్​లోని ఏపీసీ చికెన్ మార్కెట్​ను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, అధికారులతో కలిసి శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపుల దగ్గర కంపు, ఎలుకలు తిరుగుతుండడం, అపరిశుభ్రతను చూసి తీవ్ర అసహనానికి గురయ్యారు. 

నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదంటూ చికెన్ మార్కెట్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత చెత్తగా, రోతగా ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదంటూ సంబంధిత మెడికల్​ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ​ను నిలదీశారు. అసలు తనిఖీలు చేస్తున్నారా? జరిమానా వేశారా? అంటూ మందలించారు. సంబంధిత మార్కెట్​పై స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రత్యక్షంగా చూస్తేగానీ అసలు విషయం బయటలేదన్నారు. 

వెంటనే చికెన్ మార్కెట్​ను సీజ్ చేయాలని జోనల్ కమిషనర్​ రవికిరణ్ ను ఆదేశించారు. ఎంటమాలజీ, శానిటేషన్ అధికారుల సమన్వయంతో ఆయా పరిసరాలన్నింటిని శుభ్రం చేయడంతో పాటు ఫాగింగ్​చేయాలని మెడికల్ ఆఫీసర్​ను ఆదేశించారు.