హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, జనరల్ బాడీ మీటింగ్, బల్దియా బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటి అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. శనివారం సీఎంను ఆయన నివాసంలో మేయర్ కలిశారు.
గత నవంబర్ లో ఎన్నికల కోడ్ రావడంతో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీకి అడ్డంకిగా మారిందన్నారు. ఆగస్టులోనే జరగాల్సిన జనరల్ బాడీ మీటింగ్ కూడా పెండింగ్ లో ఉందన్నారు. వీటికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ కు పలుసార్లు ఆదేశాలు జారీ చేశామని, కానీ ఈ విషయంలో ఆయన ప్రభుత్వ సూచనల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.