చిన్న పనులు కూడా చేయకపోతే ఎట్ల? : మేయర్ విజయలక్ష్మి

  • ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండట్లే
  • అధికారులపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఫైర్

హైదరాబాద్ సిటీ, వెలుగు : చిన్నచిన్న పనులను కూడా ఎందుకు పెండింగ్​పెడుతున్నారని జీహెచ్ఎంసీ మేయర్​గద్వాల్ విజయలక్ష్మి అధికారులపై మండిపడ్డారు. మంగళవారం ఆమె హెడ్డాఫీసులో అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, పలు విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రజలకు అందుబాటులో ఉండకపోవడానికి కారణమేమిటని నిలదీశారు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ ఎందుకు లేట్​అవుతోందని ప్రశ్నించారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీసుల్లోనే ఉండాలని, ప్రజల బాధలు వినాలని చెప్పారు. 

ఇలాగే చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, ఇక నుంచి తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఫొటోల కోసం ప్రజావాణి కాదని, 15 రోజుల్లోగా ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు. ఈఎస్ఎల్ సంస్థ ఎలక్ట్రికల్​పనులు చేయడంలో ఫెయిల్ అయిందని, స్ట్రీట్​లైట్లు సరిగ్గా పనిచేయడంలేదని అసహనం వ్యక్తం చేశారు. సదరు సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో తనకు చెప్పాలని ఆదేశించారు. 

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని టౌన్​ప్లానింగ్ అధికారులకు చెప్పారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు శివకుమార్ నాయుడు, నళిని పద్మావతి, గీతా రాధిక, స్నేహ శబరీశ్, సుభద్ర దేవి, సత్యనారాయణ, వేణుగోపాల్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, పంకజ, సరోజ, రఘు ప్రసాద్, అశోక్ సామ్రాట్, జోనల్ కమిషనర్లు  తదితరులు పాల్గొన్నారు.