- ఎక్కడికక్కడ నాలాల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి
- కరెంట్తీగలను తాకుతున్న చెట్ల కొమ్మలు
- పాత బిల్డింగ్స్పై ఫోకస్పెట్టని జీహెచ్ఎంసీ అధికారులు
హైదరాబాద్, వెలుగు: ఈ వానా కాలంలోనూ జనానికి ఇబ్బందులు తప్పేలా లేవు. ముందస్తు చర్యలు చేపట్టాల్సిన జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ, హెల్త్ డిపార్ట్మెంట్అధికారులు నామ మాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. బల్దియా అధికారులైతే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్), మాన్సూన్టీమ్స్ ను ఏర్పాటు చేసి దాటుకుంటున్నారు. భారీ వర్షాలకు నాలాలు పొంగినా, వరదలు ముంచెత్తినా అంతా వారే చూసుకుంటారన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా నాలాల్లో పూడిక తీయలేదు. చాలా చోట్ల చెత్త, మట్టి పేరుకుపోయి ఐదారు అడుగుల ఎత్తులో మొక్కలు, చెట్లు పెరిగాయి. మురుగు ముందుకు పోయే పరిస్థితి లేదు. టెండర్లు వేశామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పనులు జరగడం లేదు. ఇక నాలాల నిర్మాణం రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. శిథిలావస్థకు చేరుకున్న పాత భవనాలను గుర్తించడం లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్సంబంధించిన పనులు కూడా చేయలేదు. కరెంట్వైర్లకు ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలను కొట్టలేదు. ఈదురుగాలులకు, వర్షం కురిసే టైంలో గంటల తరబడి సప్లై నిలిచిపోతోంది. ఇలా ఏ ఒక్క పని సక్రమంగా చేయకపోవడంతో ఇబ్బందులు ఎప్పటిలాగే ఉండేలా కనిపిస్తోంది.
సగమే అయినయ్
గతేడాది వర్షాకాలం లోపే నాలాల నిర్మాణం పూర్తిచేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించినప్పటికీ ఈ ఏడాది కూడా పనులు పూర్తి కాలేదు. డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేస్తామన్నప్పటికీ ఆ విషయంపై ఫోకస్ పెట్టలేదు. కనీసం డ్యామేజ్అయిన దగ్గర మ్యాన్ హోల్స్ కవర్లు కూడా ఏర్పాటు చేయడంలేదు. గ్రేటర్లో 37 నాలాల పనులను ప్రారంభించినట్లు చెబుతున్న అధికారులు ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పడం లేదు. ఇప్పటికే నాలుగుసార్లు డెడ్ లైన్ పూర్తయినా నాలాలు అందుబాటులోకి రావడం లేదు. సగం పనులు మాత్రమే అయ్యాయి.
ఆగని సెల్లార్ల తవ్వకం
సెల్లార్ల తవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దని నెలరోజుల క్రితమే బల్దియా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ చాలా చోట్ల గుట్టుచప్పుడు కాకుండా సెల్లార్ల తవ్వకాలు జరుపుతున్నారు. అలాగే శిథిలావస్థకు చేరిన భవనాలు గుర్తించి కుల్చివేయాలని ఆదేశించిన అధికారులు గుర్తించలేకపోతున్నారు. గడిచిన రెండేళ్లలో వర్షాకాలంలో పురాతన భవనాలు కుప్పకూలాయి. తాజాగా చంపాపేటలోనూ ఓ కాంపౌండ్ వాల్ కూలి ఇద్దరు గాయాలపాలయ్యారు. అయినప్పటికీ అధికారుల్లో చలనం ఉండడం లేదు.
మూడేండ్లుగా తీయట్లే
నాలాల పూడికతీతలో బయటపడుతున్న వస్తువులను చూస్తుంటే బాధేస్తుందని, ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని ఈ నెల 5న ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ అన్నారు. అంతేకుండా సూపర్ మార్కెట్లలో లభించని వస్తువులు నాలాల్లో లభిస్తున్నాయని కామెంట్ చేశారు. నాలాల్లో రెగ్యులర్ గా పూడిక తీస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. కానీ మూడేళ్లుగా గ్రేటర్పరిధిలో నాలాల పూడిక తీత నామమాత్రంగా సాగుతోంది. ఏళ్లకు ఏళ్లు పూడిక తీయకపోతే క్లీన్ గా ఎలా ఉంటాయని జనం ప్రశ్నిస్తున్నారు.