“అహ్మద్ నగర్ పరిధి శ్రీరాంనగర్ కాలనీ పార్కులో మూడేండ్ల కిందటి వరకు రోజూ వందలాది మంది వాకర్స్ వచ్చి వాకింగ్, వ్యాయమాలు చేసేవారు. పార్క్ వాచ్ మెచ్ భార్య చనిపోవడంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పార్కు మెయింటెనెన్స్ లేదు. పచ్చగా ఉండే పార్కు డంప్ యార్డుగా తయారైంది. గోడ కూలిపోయింది. పక్కన వేసిన చెత్త పార్కులోకి కొట్టుకువస్తుంది. మొక్కలతో పాటు గార్డెన్ ఎండిపోయింది. ప్రస్తుతం పశువులకు నిలయంగా మారింది.’’
“ విజయనగర్ కాలనీలోని పార్కులో స్ట్రీట్ లైట్లు పని చేయడం లేదని బల్దియాకు ట్విట్టర్ ద్వారా రెండురోజుల కింద కంప్లయింట్ వచ్చింది. అత్తాపూర్ పరిధి పెద్ద తాళ్లకుంట పార్కులోనూ స్ర్టీట్ లైట్లు వెలగడంలేదని, దీనిపై వారం రోజులుగా వరుసగా ట్విట్టర్ ద్వారా కంప్లయింట్ చేస్తున్నా రు. కాప్రాలోని శాలివాహన ఎన్ క్లేవ్ ఫ్రీడమ్ ట్రీ పార్కులో మొక్కలకు నీళ్లులేక ఎండిపోతున్నా యని మూడు రోజుల కిందట ట్విట్టర్ లో బల్దియాకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్. 45లోని పార్కు డంప్ యార్డుగా మారింది. దీనిపై ఈ నెల1న ఫిర్యాదు చేశారు. అల్వాల్ లోని ప్రశాంత్ విహార్ కాలనీ కౌకుర్ పార్కులో అభివృద్ధి పనులు చాలా రోజుల కిందట నిలిపివేశారని, తిరిగి ప్రారంభించాలని మరొకరు ఫిర్యాదు చేశారు. ఇలా సిటీలోని పలు పార్కుల్లో పలు సమస్యలు ఉన్నట్లు నిత్యం బల్దియాకు ఫిర్యాదులు వస్తున్నాయి.’’
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో పార్కుల మెయింటెనెన్స్ ను జీహెచ్ఎంసీ గాలికొదిలేసింది. పార్కుల నిర్వహణకు రూ. కోట్లలో ఖర్చు చేస్తుండగా స్థానికులకు అందుబాటులో ఉండట్లేదు. సిటీలో మొత్తం 985 పార్కులు ఉన్నాయి. ఇందులో 19 మేజర్ ,17 థీమ్, మిగతావి కాలనీల్లో ఉన్నాయి. వీటికోసం ప్రతి ఏటా రూ.15 కోట్లకు నిధులను బల్దియా ఖర్చు చేస్తుంది. వందకుపైగా పార్కులు బల్దియా నిర్వహణ కింద ఉండగా.. మరికొన్ని కాంట్రాక్టర్లు చూస్తున్నారు. మరో 753 పార్కుల మెయింటెనెన్స్ స్థానిక కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ల నిర్వహణలో ఉన్నాయి. మెయింటెనెన్స్ ఖర్చులో 75 శాతం కాలనీ వెల్పేర్ అసోసియేషన్లకు బల్దియా అందిస్తుంది. పార్కుల పూర్తి బాధ్యతలను చూస్తున్నందుకు వెల్ఫేర్ అసోసియేషన్ల మెయింటెనెన్స్ బల్దియా ఫండ్స్ ను అందిస్తుంది.
అయినా.. పార్కుల్లో వాకర్స్ కు ఇబ్బందులు తప్పడంలేదు. కొన్ని పార్కుల్లో వాక్ ట్రాక్ లు కూడా సరిగా లేవు. పార్కుల్లో చెత్త చెదారం పేరుకుపోయినా, కొన్ని పార్కుల గోడలు కూలినా పట్టించుకునే వారు లేరు. స్ర్టీట్ లైట్లు వెలగక సాయంత్రం అయితే పార్కుల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉంది. కొన్నేండ్లుగా పార్కుల్లో సమస్యలు నెలకొన్నాయని ప్రజలు చెబుతున్నారు. కాలనీల్లో పార్కులు సరిగా లేకపోగా.. రోడ్లపై వాకింగ్ చేస్తున్నామని కొందరు సిటీజన్లు పేర్కొంటున్నారు. గతంలో పార్కుల్లో ఉండే సెక్యూరిటీ గార్డు లు కూడా కొన్నింటి వద్ద లేకపోగా... పూర్తి కళ తప్పాయి. దీంతో పార్కుల సమస్యలపై బల్దియాకు వేలల్లో కంప్లయింట్లు చేస్తున్నారు.
ఆరు జోన్లలో రూ.. కోట్లలో ఖర్చు
బల్దియాలో ఆరు జోన్లలోని ఒక్కో పార్కు విస్తీర్ణాన్ని బట్టి ఏడాది రూ.40 వేల నుంచి కోటికిపైగా నిధులను అధికారులు ఖర్చు చేస్తున్నారు. ఖైరతాబాద్ జోన్‌లో117 పార్కులకు రూ. 3.5 కోట్లు, సికింద్రాబాద్ జోన్‌లో 90 పార్కులకు రూ. 1.20 కోట్లు, చార్మినార్ జోన్‌లో 120 పార్కులకు రూ.3 కోట్లు, కూకట్‌పల్లి జోన్‌లో 156 పార్కులకు రూ. 3.5 కోట్లు మూడున్నర కోట్లు ఎల్ బీనగర్ జోన్ లో 220 పార్కులకు రూ. 3 కోట్లు, శేరిలింగంపల్లి జోన్ లో 200 పార్కులకు రూ. 3 కోట్ల చొప్పున బల్దియా ఖర్చు చేస్తున్నది.
ఆఫీసర్లు, వీఐపీలు ఉండే ఏరియాల్లోనే..
వీఐపీలు, ఆఫీసర్లు ఉండే ప్రాంతాల్లోని పార్కులపైనే బల్దియా నిర్వహణను చూస్తోంది. సాధారణ కాలనీల్లోని పార్కులను పట్టించుకోవడంలేదు. సిటీలో అధికంగా కేబీఆర్ పార్కు కోసం ఏడాదికి రూ. 1.15 కోట్ల నిధులను ఖర్చు చేస్తుంది. జలగం వెంగళరావు పార్కుకు రూ.32 లక్షలు, లోటస్ పాండ్ పార్కుకు 20 లక్షలు, జూబ్లీహిల్స్ హెర్బల్ గార్డెన్ కు రూ.14 లక్షలు.. ఇలా వీఐపీల ఏరియాల్లోని పార్కులకే ఎక్కువ ఖర్చు చేస్తోంది. అదే కాలనీల పార్కులు కరాబ్ అయినా పట్టించుకోవడంలేదు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో ఉండే పార్కులు క్లీన్ ఉంటుండగా కొద్దిదూరంలోని చిన్న పార్కులు క్లీన్ గా ఉండటంలేదు. కనీస వసతులు కూడా కల్పించడంలేదు.
మెయింటెనెన్స్ లేకనే..
చాలా కాలనీల్లోని పార్కుల్లో మెయింటెనెన్స్చేయడంలేదు. కొన్ని పార్కుల్లో పాములు, కుక్కలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పార్కుల్లో చెత్త ఎక్కడిక్కడ పేరుకుపోతుండగా వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారు. వందలాది పార్కులు క్లీన్ గా లేకపోవడంతో జనం వెళ్లేందుకు జంకుతున్నారు. కొందరు వాకింగ్ పార్కులకు వెళ్లడమే మానేసినట్లు చెబుతున్నారు. మరోవైపు పార్కులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. వాకింగ్ ట్రాక్ లు, రోడ్లు ధ్వంసం అయినా అధికారులను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అంటున్నారు. జీహెచ్ఎంసీ ఇచ్చే ఫండ్స్ వాచ్ మెన్ జీతానికి కూడా సరిపోవడంలేదంటున్నారు. ఇప్పటికైనా పార్కులను పట్టించుకోవాలని జనం కోరుతున్నారు.