హైదరాబాద్, వెలుగు: కరోనా తర్వాత స్టేడియాలపై బల్దియా దృష్టి పెట్టట్లేదు. వైరస్ తగ్గుముఖం పట్టినా స్టేడియాల్లో అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచట్లేదు. సిటీలోని ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాల్లో సామగ్రి సరిగా లేక క్రీడాకారులు సొంతంగానే తెచ్చుకుని ఆటలు ఆడే పరిస్థితి ఉంది. గ్రేటర్ పరిధిలోని మొత్తం 521 ఆటస్థలాల్లో కోచింగ్ఇచ్చేందుకు78 మంది పార్ట్ టైమ్ కోచ్‌లు మాత్రమే ఉన్నారు. ప్రాధాన్యమున్న క్రీడలకు కోచింగ్ఇచ్చేవారు లేరు. దీంతో మెంబర్షిప్ ఉన్నవారు సొంతంగానే ఆటలు ఆడుకుంటున్నారు. కోచింగ్ కు వలంటీర్లను తీసుకుంటున్నట్లు బల్దియా అధికారులు చెబుతున్నప్పటికీ దానిపై స్పష్టత లేదు. అంతర్జాతీయ, జాతీయ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని సిటీ యువత పలు ఆటల్లో రాణించి పేరు తెచ్చుకోవాలనుకునేది కలగానే మారింది. ఆడే సత్తా ఉండి కూడా స్టేడియాల కొరత, ఉన్నవాటిలో సౌకర్యాలు లేక ప్రతిభ ఉన్నవారు కూడా బయటకు రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెబుతున్నప్పటికీ ఉన్న స్టేడియాల్లోనూ సదుపాయాలు కల్పించట్లేదని క్రీడాకారులు, యూత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ క్రీడాకారులను తయారుచేయాల్సిన బల్దియా స్పోర్ట్స్ విభాగం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. విక్టోరియా ప్లే గ్రౌండ్, అంబర్ పేట్ లాంటి గ్రౌండ్లలో కోచ్‌లు లేరంటూ ఇటీవల జరిగిన కౌన్సిల్ మీటింగ్లో పలువురు కార్పొరేటర్లు ప్రశ్నించారంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. కరోనా కారణంగా స్పోర్ట్స్ సామగ్రి తీసుకోలేదని, ఇప్పుడు అవసరాన్ని బట్టి జోన్స్థాయిలో కొనుగోలు చేస్తున్నారని, టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని బల్దియా అధికారులు చెబుతున్నారు.
జోన్ల వారీగా చూస్తే..
సిటీలోని 97 క్రీడా మైదానాల్లోనే 30 రకాల క్రీడాలకు సంబంధించి బల్దియా శిక్షణ అందిస్తోంది. జోన్ల వారీగా చూస్తే ఎల్బీనగర్10, ఖైరతాబాద్ 20, చార్మినార్ 31, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలో 19, సికింద్రాబాద్ 17 గ్రౌండ్లలోనే శిక్షణ ఇస్తున్నా, సరిపడా కోచ్‌లు లేరు. బల్దియా క్రీడా ఇన్‌స్పెక్టర్లు, పీసీసీల పేరుతో ఇన్చార్జిలు ఉండగా పర్మినెంట్ కోచ్‌లు లేరు. 78 మంది కోచ్‌లు ఉండగా పార్ట్ టైమ్ వారే. క్రీడాకారు లు తమకు ఆసక్తి కలిగిన క్రీడలను బల్దియా స్పోర్ట్స్ విభాగంలో వెబ్ సైట్ లోను, ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవా ల్సి ఉంటుంది. ఇందులో జాతీయ క్రీడలకు శిక్షణ ఇచ్చే హాకీ కోసం 4, కబడ్డీకి 4 గ్రౌండ్ల చొప్పున మాత్రమే ఉన్నాయి.
90 శాతానికిపైగా స్కూళ్లు, కాలేజీల్లో..
సిటీలో 90 శాతానికిపైగా స్కూళ్లు, కాలేజీల్లో సరైన ఆటస్థలాలు లేవు. 3 వేల నుంచి 4 వేల మంది విద్యార్థులుండే స్కూళ్లలో ఒకరిద్దరు పీఈటీలు మాత్రమే ఉంటున్నారు. దీంతో ఒక్కో తరగతి స్టూడెంట్లు వారంలో రెండుసార్లు మాత్రమే ఆటలాడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్స్పూర్తిగా ఆటలకు దూరమవుతున్నారు. కరోనాతర్వాత విద్యాసంస్థలు కూడా క్రీడలపైనా దృష్టి పెట్టట్లేదు. దీంతో క్రీడలపై విద్యార్థులకు పట్టు లేకుండాపోతోంది. స్కూల్ ఏర్పాటు చేసేటప్పుడే ప్లే గ్రౌండ్తప్పనిసరి చేస్తామనే బల్దియా నిబంధనను పట్టించుకోవడంలేదు. బల్దియా గ్రౌండ్లలో కోచ్‌లు, సామగ్రి లేక తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడంలేదు.