హైదరాబాద్, వెలుగు: చెరువుల నిర్వహణను జీహెచ్ఎంసీ అస్సలు పట్టించుకోవడం లేదు. దాదాపుగా అన్నింటిలో నిండా నీళ్లు ఉన్నాయి. వర్షాలు అధికమై వరద పెరిగితే బయటికి పంపే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది వర్షాలతో చెరువులు పొంగి అనేక కాలనీలు నీట మునిగాయి. ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈసారి కూడా అదే సమస్య రిపీట్ అయ్యేలానే ఉంది. ఎఫ్టీఎల్కి 2, 3 ఫీట్ల మేర నీరు ఉండేలా చూస్తామని చెబుతున్నప్పటికీ అలా చేయడంలేదు. అవసరమైన చోట మోటార్లు పెడతామని చెప్పి పెట్టలేదు. చెరువులు పొంగిన టైంలో మోటార్లు ఏర్పాటు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి మేయర్‌ని కోరారు. కానీ ఏర్పాటు చేయలేదు. ఇక చెరువుల పరిరక్షణను పూర్తిగా గాలికొదిలేశారు. బౌండరీలను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారే కానీ ఆ పనులు పూర్తి చేయలేకపోయారు. హెచ్ఎండీఎ ఆధ్వర్యంలో నడుస్తున్న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా అన్ని చెరువుల ఎఫ్టీఎల్ సర్వే చేశారు. మొత్తం 185 చెరువులు ఉండగా, 157 చెరువుల ఎఫ్ టీఎల్హద్దులను గుర్తించేందుకు నోటిఫికేషన్ వేశారు. కానీ ఇందులో 52 చెరువులకు సంబంధించి మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ పూర్తయింది. ఫైనల్ అయిన చెరువులకు మత్రమే అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. స్థానికుల నుంచి అభ్యంతరాలు రావడంతో మిగిలినవాటిని వదిలిపెట్టారు.
రూ.481 కోట్లు ఖర్చు
చెరువుల చుట్టూ కంచె, వాకింగ్ ట్రాక్‌లు, లైటింగ్ ఏర్పాటు, మురుగునీటి మళ్లింపు కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే రూ.481 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో గతేడాది అత్యవసర మరమ్మతుల కోసమని రూ.9.42 కోట్లు, మరో రూ.94.17 కోట్లతో 63 చెరువుల వద్ద వివిధ పనులు చేపట్టింది. రూ.282 కోట్ల మిషన్ కాకతీయ నిధులతో 19 చెరువుల వద్ద పనులు చేపట్టింది. రూ.95.54 కోట్లతో 61 చెరువులకు వెళ్లే రోడ్లను బాగు చేసేందుకు జీహెచ్ఎంసీ ఖర్చు చేయనుంది.
అభ్యంతరాల వెనుక బడా నేతలు
మొదట 157 చెరువులకు సంబంధించి నోటిఫికేషన్ వేయగా 105 చెరువులకు సంబంధించి అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో కూకట్ పల్లి నల్ల చెరువు, కైతలాపూర్ కామునిచెరువు, అల్వాల్‌లోని ఫాక్స్ సాగర్ చెరువు, షేక్ పేటలోని షాతాన్ చెరువు, గుర్రం చెరువు, దుర్గం చెరువు, సరూర్ నగర్ చెరువు,ఆర్కే పురం, ప్రగతినగర్ చెరువులతో పాటు తదితర చెరువులకు సంబంధించి అభ్యంతరాలు వచ్చాయి. అయితే ఈ అభ్యంతరాలు సామాన్యుల పేరుతో వస్తున్నప్పటికీ వీటి వెనుక బడా నేతల హస్తం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.టోలిచౌకి నదీంకాలనీ, చాంద్రాయణగుట్ట అల్ జుబైర్ కాలనీలతో పాటు అనేక ప్రాంతాల్లో 10 అడుగుల మేర వరదనీరు నిలిచింది. గుర్రం చెరువు, దుర్గం చెరువు, సరూర్ నగర్ చెరువు బతుకమ్మ చెరువు, తీగలసాగర్ చెరువు, రాయసముద్రం చెరువు, చందం చెరువు, సాకి చెరువు, తిమ్మక్క చెరువు, అప్పా చెరువు, పల్లె చెరువు, బాలాపూర్ పెద్ద చెరువులతో సహా అనేక ప్రాంతాల్లో చెరువులు ఆక్రమణలతో నామమాత్రంగా మిగిలాయి.
స్పెషల్ కమిషనర్ ఎక్కడ?
చెరువుల అభివృద్ధి, పరిరక్షణకు జీహెచ్ఎంసీలో ప్రత్యేక కమిషనర్ ని నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ నియమించడం లేదు. 2020 సెప్టెంబర్ లో మంత్రి కేటీఆర్ ప్రత్యేక కమిషనర్‌ను నియమిస్తామని ప్రకటించినప్పటికీ నేటికి ఆ విషయాన్ని పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రేటర్ పరిధిలో ఇప్పటికే 200 చెరువుల లెక్కదొరకని పరిస్థితి నెలకొంది. ఉన్నవి కబ్జా అవుతూనే ఉన్నాయి. వెయ్యి చెరువులకు గాను కేవలం185 చెరువులు మాత్రమే ఉన్నాయి.
నామ్‌కే వాస్తే చర్యలు
చెరువుల నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడంతో వర్షాల టైంలో జనం ఇబ్బంది పడుతున్నారు. గతేడాది పల్లె చెరువు కట్ట తెగడంతో ఎన్నో కాలనీలు నీట మునిగాయి. దాదాపు వారం పాటు నీటిలోనే ఉన్నాం. ఈ చెరువుకి సంబం ధించి అన్ని పనులు చేయలేదు. అప్పట్లో నామ్ కే వాస్తేగా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు.
- లక్ష్మణ్, మైలార్ దేవ్ పల్లి
ఈసారైనా సేఫేనా?
మీర్‌పేట–బడంగ్‌పేట మధ్య ఉన్న మంత్రాల చెరువు సేఫ్ గా ఉందా? చెరువుకు దిగువన ఉన్న మేం ఈసారి ధైర్యంగా ఉండొచ్చా. గతేడాది కురిసిన వర్షాలకు చెరువుకు గండి వరద నీరు కాలనీలను ముంచెత్తింది. రాత్రికి రాత్రి ఇండ్లల్లోంచి పరుగులు తీశాం. ఈసారి కూడా పెద్దగా పనులు చేసినట్లు కనిపించట్లేదు. అధికారులేమో ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. అయినా భయంగానే ఉంది.
- రవి, అయోధ్యనగర్, బడంగ్ పేట
ఇప్పటికే రిపేర్లు చేశాం
అవసరమైన చోట చెరువులకు రిపేర్లు చేశాం. మరికొన్ని చోట్ల చేస్తున్నం. ఈసారి చెరువులకు వరద పెరిగినా జనానికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నం. చెరువుల్లో సరిపడా నీళ్లు ఉంచి మిగిలిన నీటిని బయటికి పంపించేలా చర్యలు తీసుకుంటున్నం.
- సురేశ్, జీహెచ్ఎంసీ సీఈ