వారం రోజులుగా వానలతో ఆగమాగం

వారం రోజులుగా వానలతో ఆగమాగం

హైదరాబాద్, వెలుగు: సిటీలో వారం రోజులుగా ముసురు వీడటం లేదు. గత శుక్రవారం మొదలైన వానలు మళ్లీ వారం వచ్చినా తగ్గడం లేదు. అప్పుడప్పుడు భారీ వర్షాలు కురిసి, తర్వాత ముసురు పడుతోంది. సిటీ చుట్టుపక్కల కురిసిన వర్షాలతో శివారు ప్రాంతాల్లోని చెరువులు నిండుకుండల్లా మారాయి. డ్రైనేజీలు వారం రోజులుగా పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైఎక్కడిక్కడ గుంతలు ఏర్పడటంతో వాహనదారులకు ఇబ్బంది తప్పడం లేదు. 5 రోజుల్లో 200కు పైగా చెట్లు కూలిపడ్డాయి. మెయిన్ రోడ్లపై చెట్లు పడటంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యింది.  గ్రేటర్ లో 90 శాతం రోడ్లు కరాబైనయ్.  వారం రోజుల్లో సగటున సాధారణ వర్ష
పాతం కంటే గ్రేటర్​లో ఎక్కువగానే నమోదైంది. వర్షాల నేపథ్యంలో బల్దియా కంట్రోల్ రూమ్​ ఏర్పాటు చేసింది. ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్  040–- 21111111లేదా 040–29555500 
నంబర్లకు కాల్ చేయాలని పేర్కొంది.

నీళ్లు నిలిచిన ప్రాంతాలు ..
గ్రేటర్ పరిధిలో వెయ్యికిపైగా వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నాయి. నాగోల్​లోని అయ్యప్ప కాలనీలో నీరు చేరడంతో 50 కిపైగా ఇండ్లను ఖాళీ చేసి జనం వేరే ప్రాంతాలకు వెళ్లారు. మూడ్రోజులుగా వరదనీరు అలాగే ఉండటంతో ఇబ్బందులు తప్పలేదు. కొండాపూర్ హైటెన్షన్ రోడ్​లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థగా మారింది. నాగోల్​లోని రాజ్ లక్ష్మి కాలనీ, వెంకటరమణ కాలనీ, కొత్త పేట​లోని హరిపూర్ కాలనీ, గ్రీన్ హిల్స్​ కాలనీల్లో మోకాలి లోతు నీరు నిలిచింది. ఎక్కువ వర్షం కురిసిన టైమ్​లో బేగంపేట మయూరి మార్గ్​లో నడుం లోతు నీరు చేరింది. ఆ తర్వాత నీరు తొలగడంతో బురద అలాగే ఉంది. పలు చోట్లు ఇలా నీరు నిలిచిపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు.

చెరువుల్లో జల కళ..
గ్రేటర్ పరిధిలో 185 చెరువులు ఉండగా చాలా వరకు నిండుగా కనిపిస్తున్నాయి. షేక్​పేట కొత్త చెరువు పూర్తిగా నిండిపోయి గండిపడే ప్రమాదం ఏర్పడింది.  వెంటనే రిపేర్లు నిర్వహించి నీటిని బయటకు పంపడంతో ప్రమాదం తప్పింది.  నాచారంలోని పటేల్ కుంట చెరువు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో నీటిని బయటకు పంపారు. సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్, హయత్ నగర్ బాతుల చెరువు, కుమ్మరి కుంట, నాగోల్ బండ్ల గూడ చెరువులు నిండుకుండల్లా మారాయి. ఏ క్షణమైనా చెరువులు ఉప్పొంగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

270 భవనాలకు నోటీసులు.. 
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బల్దియా అధికారులు  మూడ్రోజులుగా 270 భవనాలకు నోటీసులు జారీ చేశారు. శిథిలాస్థలో ఉన్న 50కిపైగా భవనాలను కూల్చివేశారు. మరో 80 భవనాలను ఖాళీ చేయించారు. ఈ సీజన్​లో మొత్తం 180 పురాతన భవనాలను కూల్చివేయగా, 270 భవనాలను ఖాళీ చేయమనడంతో పాటు రిపేర్లు చేయించాలని టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బాల్కనీ కూలి బాలికకు గాయాలు
కూకట్​పల్లి : కేపీహెచ్‌‌బీ మూడో ఫేజ్‌‌ ఎల్ఐజీ ఫ్లాట్స్ సమీపంలోని రేకుల షెడ్డులో అంజమ్మ అనే మహిళ ముగ్గురు కూతుళ్లతో కలిసి ఉంటోంది. గురువారం ఉదయం 11 గంటలకు ఎల్​ఐజీ మొదటి అంతస్తు 49/7 ఫ్లాట్‌‌కి చెందిన బాల్కనీ అకస్మాత్తుగా కూలి రేకుల షెడ్డుపై పడింది. ప్రమాదంలో అంజమ్మ రెండో కూతురు జ్యోతి(12) చేతికి స్వల్ప గాయాలయ్యాయి.  అధికారులు బాలికకు ట్రీట్​మెంట్ చేయించి.. బాధిత కుటుంబానికి మహిళా మండలి భవనంలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు.

హుస్సేన్ సాగర్ ఫుల్...
వానలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలతో పాటు హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. హుస్సేన్ సాగర్ ప్రమాదకరంగా మారడంతో 4 రోజులుగా నీటిని బయటకు పంపుతున్నారు. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్(ఫుల్​ ట్యాంక్​ లెవెల్) 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం  513.35 మీటర్లుగా ఉంది. సాగర్​లో వస్తోన్న వరద నీటిని అధికారులు ఎప్పటికప్పుడు బయటకు పంపుతున్నారు. ఉస్మాన్ సాగర్  రెండు గేట్లు, హిమాయత్ సాగర్ ఒక గేటు ఎత్తి అధికారులు నీటిని మూసీలోకి వదులుతున్నారు.  హిమాయత్‌‌సాగ‌‌ర్‌‌ ఇన్ ఫ్లో 150 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 170 క్యూసెక్కులుగా ఉంది. అదేవిధంగా ఉస్మాన్ సాగ‌‌ర్‌‌(గండిపేట‌‌) ఇన్ ఫ్లో 400 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 408 క్యూసెక్కులుగా ఉంది.