జీహెచ్ఎంసీ ఆఫీసర్లు మా ఫోన్లు ఎత్తట్లే..

జీహెచ్ఎంసీ ఆఫీసర్లు మా ఫోన్లు ఎత్తట్లే..
  • ప్రొటోకాల్​పాటించకుండా అవమానిస్తున్నరు
  • ఇక ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తం 
  • సిటీ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే సహించం
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​యాదవ్ 
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కలిసి కమిషనర్​కు వినతిపత్రం

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రజాసమస్యల పరిష్కారానికి కాంగ్రెస్​ప్రభుత్వానికి ఏడాది టైమ్​ఇచ్చామని.. హైదరాబాద్​నగర అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, సనత్​నగర్​ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​యాదవ్ విమర్శించారు. ఇక నుంచి ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామన్నారు. ఈ మేరకు గురువారం గ్రేటర్ పరిధిలోని​బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. 

ప్రజాప్రతినిధులను బల్దియా అధికారులు అవమానిస్తున్నారని, కనీసం ప్రొటోకాల్‌‌‌‌ పాటించడం లేదన్నారు. ఏదైనా ప్రజా సమస్యపై బీఆర్ఎస్​పార్టీ ప్రజాప్రతినిధులు ఫోన్​చేస్తే అధికారులు ఎత్తడం లేదని, నంబర్లు బ్లాక్‌‌‌‌ లిస్టులో పెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని కమిషనర్‌‌‌‌ కు చెప్పామన్నారు. 

తాము కమిషనర్​దృష్టికి తీసుకువెళ్లిన సమస్యలు పరిష్కరించకపోతే ఒత్తిడి పెంచుతామన్నారు. కౌన్సిల్‌‌‌‌లో బీఆర్ఎస్​పార్టీదే మెజార్టీ అయినప్పటికీ పట్టించుకోవడం లేదని.. వారు తలచుకుంటే సభను నడపగలుగుతారా? అని తలసాని ప్రశ్నించారు. ఆయనతో బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, మాధవరం కృష్ణారావు, ముఠాగోపాల్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు మహమూద్​అలీ, వాణీదేవి, కార్పొరేటర్లు ఉన్నారు. 

దోచుకుంటున్న మేయర్‌‌‌‌ ను గద్దె దింపుతాం

కాంగ్రెస్​లోకి వెళ్లిన మేయర్‌‌‌‌ గద్వాల్​విజయలక్ష్మి నగరాన్ని దోచుకుంటున్నారని జూబ్లీహిల్స్‌‌‌‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌‌‌‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిల్డర్లు, హోటళ్ల యాజమాన్యాలను బెదిరించి అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వంలో ఇవి కుదరనందునే కాంగ్రెస్‌‌‌‌లోకి వెళ్లారన్నారు. తమ నియోజకవర్గంలో తమకు సమాచారం లేకుండా ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను గద్దె దింపుతామని హెచ్చరించారు.