- సిటీలో రిపేర్లు చేసిన ప్రాంతాల్లో తేలిన కంకర
- పనుల్లో నాణ్యతను పట్టించుకోని జీహెచ్ఎంసీ
- మొన్నటి వానలకు 3 వేల గుంతలు పూడ్చినట్లు ప్రకటన
- చాలా చోట్ల మళ్లా గుంతలు
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌లో రిపేర్లు చేసిన వారానికే రోడ్లు ఖరాబవుతున్నాయి. క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండడంతో దెబ్బతింటున్నాయి. మొన్నటి వర్షాలకు ఏర్పడిన 3,100 గుంతలను పూడ్చినట్లు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. కానీ ఆయా ప్రాంతాల్లో మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. ఎక్కడికక్కడ కంకర తేలింది. కాంట్రాక్టర్లు క్వాలిటీ పాటించకపోవడంతో పనులు చేసిన కొద్ది రోజులకే రోడ్లు పాడవుతున్నాయని నిపుణులంటున్నారు. కాంట్రాక్టర్లపై బల్దియా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా పనులు చేస్తూ, చేతులు దులుపుకుంటున్నారని పేర్కొంటున్నారు.
గ్రేటర్లో మొత్తం 9,013 కిలోమీటర్ల పెద్ద రోడ్లు.. 2,846 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు.. 6,167 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు ఉన్నాయి. వీటి నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ ఫలితం మాత్రం ఉండడం లేదు. రెండేండ్ల కింద లాక్డౌన్సమయంలో సిటీ అంతటా రోడ్లు వేశామని అధికారులు చెప్పారు. కానీ గ్రౌండ్ లెవల్ లో చూస్తే మాత్రం రోడ్లు వేసినట్టు కనిపించడం లేదు. వేసిన రోడ్లపైనే మళ్లీ వేస్తున్నారే తప్ప.. డ్యామేజ్ అయిన రోడ్లను పట్టించుకోవడం లేదు. ఇప్పటికే గుంతలమయంగా మారిన రోడ్లు.. వర్షాలకు మరింత ఖరాబవుతున్నాయి. గుంతల రోడ్లపై ప్రయాణిస్తే నడుం నొప్పి, ఇతర సమస్యలు వస్తున్నాయని జనం ఆవేదన చెందుతున్నారు.
కాంట్రాక్టర్లపై చర్యలేవీ?
రోడ్డు ఖరాబైతే కాంట్రాక్టరే మరమ్మతులు చేపట్టాలి. కాంట్రాక్టర్ కు చెల్లించే దాంట్లో 2 శాతం జీహెచ్‌ఎంసీ వద్ద డిపాజిట్‌గా ఉంటుంది. కాంట్రాక్టర్ మరమ్మతులు చేయకపోతే, అందులోంచి కట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ రోడ్ల మరమ్మతులు కాంట్రాక్టర్లు చేపట్టకున్నా, జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. మళ్లీ బల్దియా ఖర్చుతోనే మరమ్మతులు చేస్తున్నారు. టెండర్లు వేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి, ఆపై పట్టించుకోవడం లేదు. పనులు పూర్తయిన తర్వాత క్వాలిటీ చెక్ చేసి క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ... ఆఫీసుల్లోనే కూర్చొని అన్ని పనులు చేశామని చెబుతున్నారు.