జీహెచ్ఎంసీ సమావేశం రసాభసాగా జరుగుతోంది. ఈ సమావేశంలో గందరగోళ వాతావరణం నెలకొంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని అధికారులు బహిష్కరించారు. విపక్ష కౌన్సిలర్ల తీరుకు నిరసనగా అధికారులు బయటకు వెళ్లారని తెలుస్తోంది. అయితే చరిత్రలో మొదటి సారిగా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, వాటర్ బోర్డ్ అధికారులు బాయ్ కాట్ చేశారు.
విపక్ష కౌన్సిలర్లు లైఫ్ జాకెట్ ధరించి నిరసన తెలిపారు. చుక్క చినుకు పడితే నగరమంతా అల్లకల్లోలమవుతుందని తెలిపారు. ప్రజల సమస్యలపై పరిష్కరిస్తామని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. గత సమావేశాలను విపక్ష కార్పొరేటర్లు బహిష్కరించారని తెలిపారు. వారు ఇలా చేయడం చాలా బాధాకరమని విజయలక్ష్మి పేర్కొన్నారు.
ఇటీవల జలమండలి కార్యాలయాన్ని బీజేపీ కార్పొరేటర్లు ముట్టడించారు. సమావేశం సక్రమంగా జరగకుండా బీజేపీ ఎమ్మెల్సీలు ఆటంకం కలిగిస్తున్నారన్నారు. దీంతో మేయర్ విజయలక్ష్మి సమావేశాన్ని వాయిదా వేశారు. సభ్యుల విఙ్ఞప్తి మేరకే సభను ఆలస్యంగా ప్రారంభించామన్నారు.
బాధాకరమైన రోజు
మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి ఇవాళ ( మే3) చాలా బాధాకరమైన రోజన్నారు. ఐదు నెలల తరువాత ప్రజల సమస్యలు పరిష్కారం కోసం..అన్నీ పార్టీల నేతలతో చర్చించిన తరువాతే సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే బీజేపీ కార్పొరేటర్లు సంస్కారం లేకుండా మాట్లాడారని మేయర్ వాపోయారు. సభ సజావుగా జరగకుండా ఉండాలని బ్లాక్ షర్ట్స్ ధరించి నిరసనకు దిగారన్నారు.