బహదూర్‌పురాలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఒక పక్కకు ఒరిగిన నాలుగంతస్థుల భవనాన్ని కూల్చివేశారు. ఉదయాన్నే అక్కడికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు భారీ బుల్డోజర్ సాయంతో భవన కూల్చివేత ప్రారంభించారు. అదే సమయంలో చుట్టు పక్కల బిల్డింగ్‌లలో ఉంటున్న వారిని అధికారులు ఖాళీ చేయించారు. భవన యజమానిపై కేసు నమోదు చేశారు.
పూర్వాపరాలివే.. భవన నిర్మాణానికి రెండు అంతస్తులకు మాత్రమే పర్మిషన్ ఉండగా ఓనర్ గ్రౌండ్ తో పాటు నాలుగు ఫ్లోర్లు నిర్మించారు. ఒరిగిన భవనం ప్రమాదకరంగా మారడంతో చుట్టుపక్కల ఇండ్లు, అపార్ట్‌మెంట్లలో నివాసం ఉన్న వారిని ఖాళీ చేయించారు. భవన యజమాని రెండు ఫ్లోర్లకు మాత్రమే అనుమతి తీసుకొని, నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. మొదటి అంతస్తులో పగుళ్లను గుర్తించారు. భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించారు.
పిల్లర్లు మొదటి అంతస్తు ఎప్పుడో నిర్మించి యజమానికి కొన్నేళ్ల తర్వాత అదే పిల్లర్లపై భవనం నిర్మిస్తున్నాడు. పునాది బలంగా లేకుండా ఇటువంటి భారీ నిర్మాణాలు చేపట్టడంతోనే భవనం ఇలా వంగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. భవనాన్ని కూల్చివేసేందుకు ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు.
బిల్డింగ్ కూల్చివేత పూర్తి ఖర్చును ఓనర్ భరించేలా అధికారులు నిర్ణయించడంతోపాటు గతంలో డెక్కన్ మాల్ ని కూల్చివేసిన మాలిక్ ట్రేడింగ్ కంపెనీకి అప్పగించారు. మొత్తం రూ.27లక్షలకు కూల్చి వేసేందుకు ఇంటి యజమానితో ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ నిర్మాణంపై నెల రోజుల క్రితమే స్థానికులు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించ లేదని తెలిసింది.