గచ్చిబౌలిలో ఒరిగిన బిల్డింగ్ కూల్చేసిన్రు

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ గచ్చిబౌలిలోని సిద్ధిఖీ నగర్‌‌‌‌‌‌‌‌లో ఒక వైపు ఒరిగిపోయిన ఐదంతస్తుల భవనాన్ని జీహెచ్​ఎంసీ అధికారులు కూల్చేశారు. అత్యాధునిక హైడ్రాలిక్ యంత్రాల సాయంతో బుధవారం మధ్యాహ్నం పనులు ప్రారంభించి రాత్రికల్లా నేలమట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా చుట్టూ ఉన్న మరికొన్ని ఇండ్లను అధికారులు ఖాళీ చేయించారు. జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ, హైడ్రా సిబ్బంది దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. ఉదయం బిల్డింగ్ కూల్చుతున్న టైమ్​లో హైడ్రాలిక్‌‌‌‌‌‌‌‌ యంత్రం డీజిల్‌‌‌‌‌‌‌‌ పైప్‌‌‌‌‌‌‌‌ లీకేజీతో కొంతసేపు పనులు ఆగిపోయాయి. 

తర్వాత వాటిని రిపేరు చేశాక కూల్చివేతలు తిరిగి ప్రారంభించారు. బిల్డింగ్​లో నివాసం ఉంటున్న 50 మందితో పాటు చుట్టుపక్క వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. కాగా, హైడ్రాలిక్ మిషిన్లు బిల్డింగ్ వద్దకు తీసుకెళ్లేందుకు జీహెచ్​ఎంసీ, హైడ్రా అధికారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఇష్టమొచ్చినట్లు ఇండ్లు కట్టుకోవడం, ఇరుకైన సందుల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆఫీసర్లు తెలిపారు. ఒకవైపు ఒరిగిపోయిన ఇంట్లోని గ్యాస్ సిలిండర్లు పేలితే మరింత ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. ఫైరింజన్లు తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సరైన మార్గం లేకపోవడంతో ఫైరింజన్ అక్కడికి చేరుకోలేకపోయింది. 

ఒరిగిపోయిన బిల్డింగ్​కు కొద్దిదూరంలో వాటిని ఆపేసి కూల్చివేత పనులు చేపట్టారు. సిద్ధిఖీనగర్​లో కట్టిన భవనాలకు ఎలాంటి సెట్​బ్యాక్​లు లేవు. ఎటు వైపు చూసినా 5 నుంచి 7 అంతస్తుల భవనాలే ఉన్నాయి. బిల్డింగ్​ల మధ్య కూడా ఎక్కడా ఖాళీ స్థలం లేదు. తాజాగా సెల్లార్ కోసం తవ్వకాలు చేపడుతున్న టైమ్​లోనే ఐదంతస్తుల బిల్డింగ్ ఒరిగిపోయింది.  

ల్యాండ్ ఓనర్, కాంట్రాక్టర్​పై కేసు

శేరిలింగంపల్లి సర్కిల్ పరిధి గచ్చిబౌలిలోని సిద్ధిఖీనగర్ రోడ్డు నంబర్ 1లో 1,605, 1,638 ప్లాట్లను కలుపుకుని మొత్తం 200 గజాల జాగా ఉన్నది. ల్యాండ్ ఓనర్ యాసిన్​ఖాన్.. బిల్డింగ్ నిర్మాణ పనులను శ్రీనుకు అప్పగించాడు. నాలుగు రోజులుగా పిల్లర్ల కోసం తవ్వకాలు చేపడ్తున్నారు. ఎలాంటి సెట్​బ్యాక్  లేకుండానే పనులు మొదలు పెట్టారు. దీంతో 1,639 ప్లాట్ నంబర్​లో లక్ష్మణ్ అనే వ్యక్తికి చెందిన బిల్డింగ్ పిల్లర్లు బయటకొచ్చాయి. మట్టి కుంగిపోవడంతో ఐదంతస్తుల భవనం మంగళవారం రాత్రి 8 గంటలకు ఒకవైపు ఒరిగిపోయింది. దీంతో బిల్డింగ్​లో ఉన్నవాళ్లంతా భయంతో బయటికి పరుగులు తీశారు. బుధవారం ఉదయం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు భవనాన్ని పరిశీలించారు. ఓనర్ లక్ష్మణ్​కు నోటీసులిచ్చి బిల్డింగ్​ను కూల్చేశారు. శేరిలింగంపల్లి సర్కిల్.. టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకట రమణ ఫిర్యాదు మేరకు యాసిన్ ఖాన్, కాంట్రాక్టర్ శ్రీనుపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

60 గజాల జాగాలో ఐదంతస్తుల బిల్డింగ్

బిల్డింగ్​లో నివాసం ఉన్న 50 మంది కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు. కేవలం 60 గజాల జాగాలోనే ఐదంతస్తుల బిల్డింగ్ నిర్మించారు. మొత్తం 8 పోర్షన్లు ఉన్నాయి. అతి కష్టం మీద ఇంట్లోని విలువైన సామాగ్రి మాత్రమే యంత్రాల సాయంతో కిందికి తీసుకొచ్చారు. సెట్​బ్యాక్ లేకుండా సెల్లార్ తవ్వకాలు చేపట్టడంతోనే తమ బిల్డింగ్ కూలిపోయిందని లక్ష్మణ్, అతని భార్య స్వప్న కన్నీరు పెట్టుకున్నారు. జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంత చెప్పినా శ్రీను వినిపించుకోలేదని మండిపడ్డారు. ఊళ్లో ఉన్న పొలాలు అమ్మి ఇల్లు కట్టుకున్నట్లు తెలిపారు.

సర్టిఫికెట్లు ఇంట్లోనే ఉండిపోయినయ్

భూకంపం వచ్చిందేమో అనుకుని మంగళవారం రాత్రి భయంతో పరుగెత్తుకొని బయటికొచ్చినం. కిందికి వచ్చి చూస్తే మా బిల్డింగ్ పక్కకు ఒరిగిపోయింది. నేను ఐదో ఫ్లోర్​లోని 501 రూమ్​లో ఉంటున్న. సర్టిఫికెట్లు, లాప్​టాప్​లు ఇంట్లోనే ఉండిపోయినయ్. ఇంటిని కూల్చేస్తామని అధికారులు వచ్చిన్రు. సర్టిఫికెట్లు తెచ్చుకుంటామని చెప్పినా పైకి వెళ్లనివ్వలేదు. కట్టుబట్టలతో మిగిలిపోయినం. ఈ బిల్డింగ్​లో చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నరు. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. 
- సత్యనారాయణ, బాధితుడు, చెఫ్