డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్స్ అగ్ని ప్రమాదం అనంతరం ఆచూకీ లేకుండా పోయినా ముగ్గురిలో ఒకరి మృతదేహం కనిపించినట్లు తెలుస్తోంది. సెకండ్ ఫ్లోర్ లో ఒక డెడ్ బాడీ కనిపించిందని బిల్డింగ్ ఓనర్ చెబుతున్నారు. భవనాన్ని పరిశీలించేందుకు వెళ్లినప్పుడు ఒక మృతదేహం కనిపించిందని అధికారులు తనతో చెప్పారని అంటున్నాడు. అయితే అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదిలా ఉంటే సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఘటనాస్థలానికి వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు బిల్డింగ్ ను పరిశీలిస్తున్నారు. అయితే పొగ దట్టంగా కమ్మేయడం, వేడి కారణంగా లోపలకు వెళ్లడం కష్టంగా మారింది. బిల్డింగ్ లో ఐరన్ ర్యాక్ లు ఏర్పాటు చేసి టాన్ల కొద్దీ బట్టలను నిల్వచేసినట్లు అధికారులు గుర్తించారు. ఫ్యాబ్రిక్ మెటీరియల్ కావడంతో మంటలు వేగంగా అంటుకుని ఉంటాయని అనుమానిస్తున్నారు. మరోవైపు గంటల తరబడి మంటలు కొనసాగడంతో బిల్డింగ్ పటిష్టతపై అనుమానాలు నెలకొన్నాయి. టెక్నికల్ టీం, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ భవనాన్ని పరిశీలించిన అనంతరం కూల్చివేతపై నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ తో పాటు పక్క భవనాలను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు.