- రూ.5,135 కోట్లతో 415 కొత్త పనులు చేపట్టాలని ప్లాన్
- ఈ ఏడాది రూ.458 కోట్లతో 29 పనులు చేసేందుకు టెండర్లు
- త్వరలోనే పనులు మొదలయ్యే అవకాశం
- ఫేజ్–1 కింద చేపట్టిన 37 పనుల్లో 31 పూర్తి..
- ఆరు చోట్ల పెండింగ్.. కొన్ని పనులు మొదలు కాలే
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్పరిధిలోని నాలాల నిర్మాణంపై జీహెచ్ఎంసీ ఫోకస్పెట్టింది. ఇప్పటికే ఎస్ఎన్డీపీ ఫస్ట్ఫేజ్కింద 37 పనులు చేపట్టగా, 31చోట్ల పనులు పూర్తయ్యాయి. తాజాగా ఫేజ్–2ను మొదలుపెట్టేందుకు బల్దియా అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వచ్చేశాయి. ఫేజ్–2 కింద రూ.5,135 కోట్లతో సిటీతోపాటు శివారు మున్సిపాలిటీల్లో 415 పనులు చేపట్టాలని నిర్ణయించారు.
విడతల వారీగా ఈ పనులను పూర్తిచేయనున్నారు. ముందుగా ఈ ఏడాది రూ.458 కోట్లతో 29 పనులు చేపట్టనున్నారు. వీటికి సంబంధించి కన్సల్టెన్సీ టెండర్లు ఇప్పటికే పూర్తయ్యాయి. త్వరలో టెండర్లను ఫైనల్చేసి పనులు స్టార్ట్ చేయనున్నారు. అయితే ఇక నుంచి సిటీలో చేపట్టే ప్రతి పనిని హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్ ఫర్మేటివ్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కింద చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఆర్ఎంపీ పనులు కూడా అందులోకే వస్తాయి.
నిధులే పెద్ద సవాల్
సెకండ్ ఫేజ్ పనులకు అప్రూవల్ వచ్చినప్పటికీ నిధులు సమకూర్చడం జీహెచ్ఎంసీకి పెద్ద సవాల్ గా మారింది. గత సర్కార్ చేసిన అప్పులతో బల్దియా పూర్తిగా డీలా పడింది. తాజాగా రూ.5,135 కోట్ల పనులకు అనుమతి వచ్చినప్పటికీ నిధులు ఉన్నదాన్ని బట్టే బల్దియా అధికారులు పనులు చేపట్టనున్నారు. వచ్చే నెలలో 29 నాలాల పనులు మొదలవుతాయని తెలుస్తోంది. ఎస్ఎన్డీపీ ఫేజ్–1లో భాగంగా మొత్తం 58 నాలాల పనులు చేయాలని నిర్ణయించారు. ఇందులో గ్రేటర్ లో 37 పనులు చేపట్టగా, నేటికీ ఆరు పనులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో కొన్ని చివరి దశకు చేరుకోగా, కొన్ని ఇంకా మొదలే కాలేదు.
నాలాలతో వరదలకు చెక్
జీహెచ్ఎంసీ చేపడుతున్న నాలాలతో వరదలకు చెక్ పడనుంది. ఇప్పటికే పూర్తయిన నాలాలతో సిటీలో భారీ వర్షాలు కురిసిన టైంలో కొంత వరద ప్రభావం తగ్గింది. సెకండ్ ఫేజ్ పనులన్నీ పూర్తయితే ఎంతటి భారీ వర్షం కురిసినా ఇబ్బందులు ఉండవని బల్దియా అధికారులు చెబుతున్నారు. సెకండ్ ఫేజ్ లో భాగంగా ముందుగా చేపడుతున్న 29 నాలాల పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే వీటిని నిర్మిస్తున్నారు. మొన్నటి దాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సెకండ్ ఫేజ్పనులను పెండింగ్పెడుతూ వచ్చింది. పనులకు అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్సర్కార్ వచ్చీరాగానే నాలా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వరదలు ముంచెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున నాలాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది..