భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. నగరంలో వర్షాల కారణంగా ఎటువంటి సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమై 24 గంటలు అందుబాటులో ఉండాలని మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆదేశించారు. అధికారులతో కలిసి మేయర్ విజయలక్ష్మీ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి మూడు గంటలకు ఒకసారి వరద పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. అధికారులందరూ అప్రమత్తమై పని చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సెలవులు లేకుండా పని చేయాలని ఆదేశించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. ప్రజలు అత్యవసర సమస్యలు ఉంటే GHMC కంట్రోల్ రూమ్ నెంబర్ ను 040-21111111, 040-29555500 సంప్రదించగలరని చెప్పారు.
రాష్ట్రంలో విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు
రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రాణనష్టం జరగకుండా చూడాలని, ప్రజలకు ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆదేశించారు. ముందస్తు చర్యల్లో భాగంగా సోమ, మంగళ, బుధ వారాలు మూడు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.