- మొత్తం 542 ఎమర్జెన్సీ బృందాలు ఏర్పాటు
- వాటర్ లాగింగ్ పాయింట్లపై స్పెషల్ ఫోకస్
- గతంలో 125 ఉండగా.. ప్రస్తుతం 32కి తగ్గింపు
హైదరాబాద్, వెలుగు : వానాకాలంలో వరదల నివారణకు బల్దియా ప్లాన్ చేసింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా వరదలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాన్సున్ కి సంబంధించిన తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో బల్దియా అధికారులు ప్లాన్ రెడీ చేశారు.
వరదలతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ లను ఏర్పాటు చేసింది. వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల వద్ద వరద నీటిని తొలగించేందుకు కూడా చర్యలు చేపట్టింది. గ్రేటర్ సిటీలో పని చేసేందుకు 534 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేసింది. గత నాలుగేండ్లతో చూస్తే ఈసారి టీమ్స్‌ని భారీగా పెంచారు. 2021లో 195, 2022లో 172 టీమ్స్, గతేడాది 394 టీమ్స్ ఏర్పాటు చేయగా ఈసారి రెట్టింపు ఏర్పాటు చేశారు.
తగ్గిన లాగింగ్ పాయింట్లు
గ్రేటర్ సిటీలో125 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉన్నాయి. ఇందులో బల్దియా శాశ్వత పరిష్కారం చూపుతూ కొన్ని కొన్ని తగ్గిస్తుంది. ప్రస్తుతం 32 వాటర్ లాగింగ్ పాయింట్లు మాత్రమే ఉన్నాయి. వాటిని కూడా పూర్తిగా తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నీళ్లు నిలిచే ఏరియాల్లో మళ్లీ నీరు చేరకుండా చర్యలు తీసుకొని ఆయా పాయింట్లను ఎత్తేస్తున్నారు. వర్షాల పడ్డప్పుడు వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల వద్ద డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచేందుకు.. వరద త్వరగా వెళ్లేందుకు ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం సిటీలో చిన్నపాటి వాన పడినా పలు ప్రాంతాల్లో వరదనీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వదర నిలిచే చోట చర్యలు తీసుకుంటున్నట్టు, దీంతోనే ప్రతిఏటా వాటర్ లాగింగ్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
ఆఫీసుల వేళల్లో మార్పులు
వానలు పడ్డప్పుడు ఉద్యోగులు ఒకేసారి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని బల్దియా కోరింది. పోలీసు అధికారులతో కలిసి ఆఫీసుల వేళల్లో మార్పులకు నిర్ణయం తీసుకుంటారు. చిన్నపాటి వర్షం పడితే ఐటీ కారిడార్ లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. వాన పడిన సమయంలో ఐటీ కంపెనీల ఎంప్లాయీస్ ఒకేసారి లాగౌట్ చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర కంపెనీలు, ఆఫీసులు కూడా పలు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు తీసుకునేందుకు బల్దియా సిద్ధమైంది. అలాగే భారీవర్షాలు కురిసే సమయంలో ప్రజలు కూడా ఎమర్జెన్సీ అయితేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ సూచిస్తుంది. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే కొంతమేర ఇబ్బందులు తప్పుతాయని పేర్కొంటుంది.
24 గంటలు కంట్రోల్ రూమ్
బల్దియా హెడ్డాఫీసుతో పాటు ఈవీడీఎం ఆఫీసులో 24 గంటలు కంట్రోల్ అందుబాటులో ఉండనుంది. సిటీలో ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా 040–2111111 నంబర్ తో పాటు 040–29555500 లేదా 9000113667 నంబర్లకు కాల్ చేయొచ్చు. వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు పంపొచ్చు. సమస్యకు సంబంధించిన ఫొటోతో పాటు లోకేషన్ షేర్ చేస్తే అక్కడకు వెంటనే డీఆర్ఎఫ్ టీమ్స్‌ని పంపేందుకు కంట్రోల్ రూమ్ సాయం చేస్తుంది. డ్రైనేజీ మూతలు ఓపెన్ చేయొద్దని, ఓపెన్ చేసి ఉంటే కూడా సమాచారం ఇవ్వాలి.