హైదరాబాద్, వెలుగు: ప్లాస్టిక్ భూతంపై ఎంత అవగాహన కల్పించినా.. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సిటీలో వాడకం మాత్రం తగ్గట్లేదు. గ్రేటర్ లో రోజూ సుమారు 4,500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, ఇందులో 15 నుంచి 20 శాతం వరకు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. పాల ప్యాకెట్నుంచి కూరగాయలు, చికెన్, మటన్, కిరాణ వస్తువులు.. ఇలా ఏది కొన్నా ప్లాస్టిక్కవర్లలోనే తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా నిషేధిత ప్లాస్టిక్ కవర్లే వ్యాపారుల వద్ద కనిపిస్తున్నాయి. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న కవర్లనే ఎక్కువగా వాడుతున్నారు. పర్యావరణానికి హానికరమని సెంట్రల్ పొల్యూషన్కంట్రోల్ బోర్డు ప్రతిఏటా మైక్రాన్ల మందాన్ని పెంచుతుండగా నిషేధిత ప్లాస్టిక్ వాడకమైతే తగ్గడంలేదు. గతంలో 40 మైక్రాన్లు, ఆ తర్వాత 50 మైక్రాన్ల వరకు నిషేధం విధించారు. ప్రస్తుతం 75 మైక్రాన్లలోపు కవర్లపై నిషేధం ఉంది. ప్లాస్టిక్ వాడకం ఆగకపోగా, ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు రోడ్ల పక్కన, నాలాలు కవర్లతో నిండిపోతున్నాయి. ఫలితంగా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతుంది.
కౌన్సిల్‌లో తీర్మానం చేసినా..
గ్రేటర్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్టు గతంలో కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. మూడేండ్ల కిందట కొన్నాళ్ల పాటు అధికారులు వరుసగా తనిఖీలు నిర్వహించారు. నిషేధిత కవర్లతోపాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మినా, వాడినా ఫైన్లు వసూలు చేశారు. ఇప్పడు ఎక్కడ కూడా పెద్దగా తనిఖీలు చేయడంలేదు. కౌన్సిల్ తీర్మానం అమలుకు నోచుకోవడం లేదు. ఏ ఫంక్షన్ కి వెళ్లినా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నే వాడుతుండగా దీనిపై బల్దియా పెద్దగా అవగాహన కల్పించట్లేదు. మరోవైపు వాడకం కూడా పెరిగిపోతోంది. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు ఇలా షాపింగ్ కి వెళితే ప్లాస్టిక్ కవర్లు, బ్యాగ్ లు ఉచితంగా ఇవ్వాల్సిందే. ఇందుకు భిన్నంగా ఎక్కడైనా వ్యవహరిస్తే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తే తనిఖీలు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
ఏ సమావేశమైనా దీనిపైనే చర్చ
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ పై బల్దియా అధికారులు మొన్నటి వరకు పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల జాంబాగ్ లోని పూల మార్కెట్లో 84 మంది వ్యాపారులకు ఫైన్లు వేశారు. ప్రస్తుతం ఏ సమావేశం జరిగిన కూడా ఇదే అంశంపై కిందిస్థాయి అధికారులను ఆదేశిస్తున్నారు. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడే వారిపై చర్యలు తీసుకుంటామని అడిషనల్ కమిషనర్ సంతోశ్ తెలిపారు.
నిషేధిత ప్లాస్టిక్ పై ఫిర్యాదు చేయొచ్చు
75 మైక్రాన్ల మందం కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడితే సదరు వ్యాపారికి మొదటిసారైతే రూ.10 వేలు, రెండోసారైతే రూ.25 వేల వరకు ఫైన్లను బల్దియా అధికారులు వేయొచ్చు. మూడోసారి కూడా వాడితే ఫైన్ తో పాటు షాపు లోని స్టాక్‌ని సీజ్ చేసే అధికారం ఉంది. ఎక్కడైనా వాడుతున్నట్టు గుర్తించినా కూడా బల్దియా హెల్ప్ లైన్ నంబర్‌కు 040–-21111111 ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. షాపింగ్ చేసినప్పుడు కవర్లకు డబ్బులు వసూలు చేస్తే కన్స్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేయొచ్చు. నాంపల్లి నుంచి ఎంజే మార్కెట్ వెళ్తుండగా కేర్ హాస్పిటల్ కంటే ముందుగానే ఓల్డ్ కట్టెలమండిలోని చంద్రవిహార్ లో 9వ అంతస్తులో హైదరాబాద్జిల్లాకి సంబంధించిన కన్స్యూమర్ ఫోరం కోర్టు ఉంది. అక్కడ ఫిర్యాదు చేస్తే ఫైల్ చేసి కేసు నెంబర్ ఇస్తారు. ఏడాదిలోపు విచారణ జరిపి న్యాయం చేస్తారు. ఇలా గతంలో చాలామంది ఫిర్యాదు చేసి న్యాయం పొందారు.