హైదరాబాద్, వెలుగు: నిమజ్జనం చేసిన గణేశ్ విగ్రహాల నుంచి వచ్చే ఐరన్‌ను క్యాష్ చేసుకునే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. హుస్సేన్ సాగర్ సహా, బేబీ పాండ్స్‌లో వేసిన విగ్రహాల నుంచి ఐరన్ ను తీసి బయటికేసి జీహెచ్ఎంసీ చేతులు దులుపుకుంటోంది. కేవలం సిల్ట్ మాత్రమే తమ బాధ్యత అని, ఐరన్‌తో సంబంధం లేదని హెచ్ఎండీఏ వాదిస్తోంది. దొరికిందే సందు అని కోట్ల విలువ చేసే ఐరన్‌ను క్రేన్ఆపరేటర్లు, ఇతరులు ఎత్తుకు పోతున్నారు. తీసింది తీసినట్లు ట్రక్కుల్లో నింపుకుని వెళ్తున్నారు. అదే రెండు డిపార్ట్మెంట్ల అధికారులు కోఆర్డినేట్చేసుకుని నవరాత్రులకు ముందుగానే టెండర్లు పిలిచినట్లయితే ప్రభుత్వానికి రూ.కోట్ల ఆదాయం వచ్చేది.
ఉత్సవాలు, నిమజ్జనం కోసం చేసిన ఖర్చులో ఎంతో కొంత తగ్గేది. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో అన్ని చోట్ల నీటి నుంచి తీసి బయటేసిన ఐరన్ మొత్తం మాయమైంది. హుస్సేన్ సాగర్, 74 బేబీ పాండ్స్, ఇతర చెరువుల్లో గణనాథుల నిమజ్జనం చేశారు. మెజార్టీ విగ్రహాలను ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం చేశారు. ఇక్కడి ఏర్పాట్లు మొత్తం జీహెచ్ఎంసీనే చేసింది. ట్యాంక్ బండ్ లోని సిల్ట్‌ను మాత్రం హెచ్ఎండీఏ తరలిస్తుంది. ఏటా హెచ్ఎండీఏని బద్నాం చేస్తున్నారని ఈసారి ముందుగానే హెచ్ఎండీఏ అధికారులు జీహెచ్ఎంసీకి లెటర్ రాశారు. విగ్రహాల నుంచి వచ్చే ఐరన్బాధ్యత తమది కాదని అందులో తేల్చి చెప్పారు.
మాకేం సంబంధం లేదు
హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తున్న విగ్రహాల నుంచి వచ్చే స్టీల్‌తో తమకు సంబంధం లేదని హెచ్ఎండీఏ అధికారులు గత నెల 27న ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కి లెటర్ రాశారు. ఏటా విగ్రహాల నుంచి వచ్చే ఐరన్ మొత్తాన్ని క్రేన్ల ఆపరేటర్లతోపాటు ఇతరులు తీసుకెళ్తున్నట్లు తాము సీసీటీవీ పుటేజీల్లో గుర్తించినట్లు అందులో పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ లోపల ఉండే సిల్ట్ మాత్రమే తమ బాధ్యతఅని స్పష్టం చేశారు. ఐరన్ కి సంబంధించి తాము ఎటువంటి చర్యలు తీసుకోలేమని వెల్లడించారు. ఐరన్‌పై జీహెచ్ఎంసీనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
లేదు.. లేదు.. మీదే బాధ్యత
నిమజ్జనం తర్వాత విగ్రహాల నుంచి వచ్చే ఐరన్ కి సంబంధించిన అంశాన్ని హెచ్ఎండీఏనే చూసుకోవాల్సి ఉందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. తమకు ఐరన్ టెండర్లకి సంబంధం లేదని సమాధానం ఇస్తున్నారు. నవరాత్రులకు ఏర్పాట్లు చేసేవరకే తమ బాధ్యత అంటున్నారు. ఐరన్విషయమై ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ని అడగగా అది హెచ్ఎండీఏ బాధ్యత అని చెప్పారు. ఇలా రెండు డిపార్ట్మెంట్ల అధికారులు తమ పరిధి కాదంటే.. తమ పరిధి కాదంటూ కోట్ల విలువైన ఐరన్ ను ఇతరులకు వదిలేస్తున్నారు. ఈ క్రమంలో క్రేన్ల ఆపరేటర్లు, వారికి సంబంధించిన వ్యక్తులు, కొందరు బయటి వ్యక్తులు చెరువులు, ట్యాంక్‌బండ్ వద్ద కుప్పగా పోసిన ఐరన్వేస్ట్ను లారీలు, ట్రక్కుల్లో ఎత్తుకుపోతున్నారు.
ఆదాయం వచ్చే ఆప్షన్ ఉన్నా..
ఈసారి నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ వద్ద 32 కేన్లు సహా గ్రేటర్‌లోని చెరువుల వద్ద జీహెచ్ఎంసీ 280 క్రేన్లు ఏర్పాటు చేసింది. అలాగే లైటింగ్, ఇతర ఏర్పాట్లు కోసం కోట్లు ఖర్చు చేసింది. అన్ని ప్రాంతాల్లో కలిపి అధికారికంగా లక్షా30వేల విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు చెబుతున్నా, ఆ సంఖ్య దాదాపు 2 లక్షల వరకు ఉంది. ప్రతి విగ్రహానికి కిందిభాగంలో ఐరన్ సీట్ఉంటుంది. దాని మీదే విగ్రహాన్ని తయారు చేస్తారు. నిమజ్జనం తర్వాత విగ్రహాల నుంచి తీసిన మొత్తం ఐరన్విలువ కోట్లలో ఉంటుంది. చెరువుల క్లీనింగ్‌లో భాగంగా ఎప్పటికప్పుడు బయటికి తీసిన విగ్రహాల ఐరన్‌ను సేకరిస్తే జీహెచ్ఎంసీకి కోట్లలో ఆదాయం వస్తుంది. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కనీసం ఐరన్కోసం ముందుగానే టెండర్లు పిలిస్తే గణపతి నవరాత్రుల కోసం చేసే ఖర్చులో ఎంతో కొంత బల్దియాకు తిరిగి వచ్చేది. కానీ ఆ పట్టింపే లేదు.