- నెలలు గడుస్తున్నా వివరాలు అందట్లే
- సర్కిల్ ఆఫీసుల చుట్టూ దరఖాస్తుదారుల చక్కర్లు
- డైలీ వెయ్యికి పైగా అప్లికేషన్లు పెండింగ్‌లోనే..
హైదరాబాద్, వెలుగు: సమాచార హక్కు చట్టాన్ని(ఆర్టీఐ) జీహెచ్ఎంసీ అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. ఆర్టీఐ కింద వివరాలు కోరిన వారికి జవాబుదారీగా ఉండి30 రోజుల్లోగా అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అధికారులు.. రేపు, తర్వాత అంటూ తప్పించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అసలెందుకు సమాచారం ఇవ్వాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారని దరఖాస్తుదారులు చెబుతున్నారు. అయితే, సమాచారం ఇస్తే ఏం చేస్తున్నామో అంతా బట్టబయలు అవుతుందని భావిస్తూ అడిగిన వారికి సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. నిధులు, పనులు, చర్యలు, అభివృద్ధి ఇతరత్రా ఏ విషయం గురించి అడిగినా సమాచారం ఇచ్చేందుకు బల్దియా ఆఫీసర్లు ముందుకు రావడంలేదు. ఆర్టీఐకి సంబంధించి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరు అని తెలిపే బోర్డులు కూడా బల్దియా సర్కిల్ ఆఫీసుల్లో ఉండటం లేదు. బల్దియాకు సంబంధించిన పలు విషయాలపై సమాచారం ఇవ్వాలని సంబంధిత అధికారులను కోరుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అన్ని డిపార్ట్మెంట్లలోనూ అదే తీరు..
సమాచారం అడిగిన ప్రతి ప్రశ్నకి జీహెచ్ఎంసీ అధికారులు తప్పించుకునేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. యాక్ట్‌లోని చిన్న చిన్న లొసుగులతో అసలు జవాబులే ఇవ్వడం లేదని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. జీహెచ్ఎంసీలోని అన్ని డిపార్ట్మెంట్లలోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది. టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, శానిటేషన్ తదితర వాటికి సంబంధించి దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి. వివిధ రకాల సమాచారం కోసం ఆర్టీఐ యాక్ట్ కింద వచ్చిన దరఖాస్తులు ఆఫీసుల్లో దాదాపు వెయ్యికిపైగా ఉన్నట్లు సమాచారం.
అప్పీల్‌కు వెళ్తున్నరు..
కొందరికి జవాబులు అందుతున్నప్పటికీ అసంపూర్తిగా ఉంటోంది. మరికొందరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండటం లేదు. ఎంతకూ సమాచారం ఇవ్వకపోవడంతో కొందరు అప్పీల్‌కు వెళుతున్నారు. అయినప్పటికీ సమాధానం రాకపోవడంతో సెకండ్ అప్పీల్ కింద కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద వందల కొద్దీ అప్లికేషన్లు ఇస్తే కేవలం నాలుగైదింటికి మాత్రమే సమాచారం ఇస్తున్నారని సోషల్ యాక్టివిస్ట్ అబ్దుల్ రెహమాన్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో పనులు, ఫండ్స్తదితర అంశాలపై అడిగితే స్పందించడం లేదని ఆయన చెప్పారు.