అప్పు తెచ్చుకుని పనులు చేయండి !

అప్పు తెచ్చుకుని పనులు చేయండి !

హైదరాబాద్, వెలుగు:  నిధులు ఇవ్వకుండానే పనులు చేయాలంటూ జీహెచ్ఎంసీని ప్రభుత్వం ఆదేశిస్తోంది. అప్పులు చేసి పనులు చేయాలంటోంది. అయితే, జీహెచ్ఎంసీకి అప్పు పుట్టకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. నాలాలు, రోడ్లు ఇతర పనులు చేసేందుకు లోన్ల కోసం అధికారులు తిరుగుతున్నారు. సెకండ్ ఫేజ్ నాలా పనులు పూర్తిచేసేందుకు కోసం రూ.2 వేల కోట్ల అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. నిధులు లేకపోవడంతో.. గ్రేటర్, శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీల అనుసంధానం, జంక్షన్ల అభివృద్ధి కోసం 

హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్ఆర్డీసీఎల్) ద్వారా జీహెచ్ఎంసీ  నిధులతో లింక్ రోడ్లు నిర్మాణానికి అనుమతులు వచ్చి 8 నెలలైనా పనులు ముందుకు సాగడం లేదు. జీహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కల ఉన్న 10 మున్సిపాలిటీల్లో రూ.2,410 కోట్ల అంచనాతో 104 లింక్ రోడ్లు, కారిడార్లలో 10 యూఎల్​బీల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ రోడ్ల వైడెనింగ్ కూడా చేయలేదు.
 
అన్నిచోట్లా అదే పరిస్థితి..


జీహెచ్ఎంసీ వద్ద నిధులు లేక పనులేవీ జరగడం లేదు. శివారులోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఎప్పుడో వేసిన రోడ్లను కూడా వైడెనింగ్ చేయడం లేదు. నామమాత్రంగా రిపేర్లు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. జవహర్​నగర్ కార్పొరేషన్​లోని బాలాజీ నగర్ కమాన్ నుంచి మున్సిపల్ ఆఫీసు వరకు గతేడాది రోడ్డు పనులు చేపట్టారు. కానీ కేవలం డివైడర్లు మాత్రమే వేయడంతో రోడ్లు గుంతలమయమయ్యాయి. గుంతల కారణంగా  ప్రమాదాలు జరిగినా పనులు మాత్రం చేపట్టడం లేదు. బండ్లగూడ జాగీర్ నుంచి కిస్మత్ పురా వెళ్లే రోడ్డు 100 ఫీట్ల మేర వైడెనింగ్ కోసం అనుమతులు వచ్చినా నేటికీ పనులు స్టార్ట్ చేయలేదు. ఈ రూట్​లో నిత్యం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇలా చాలా ప్రాంతాల్లో రిపేర్లకు అనుమతులు లభించినా.. నిధులు లేక పనులు జరగడం లేదు.

రూ.1,250 కోట్లతో  10 మున్సిపాలిటీల్లో రోడ్లు


సిటీ శివారులోని బండ్లగూడ జాగీర్, ఘట్​కేసర్, కొత్తూరు, దమ్మాయిగూడ, నాగారం, బడంగ్ పేట, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, మణికొండ, జవహర్ నగర్ మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో రూ.1,250 కోట్లతో 103.45 కి.మీ. మేర లింక్ రోడ్లను నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. కానీ ఆ పనులు మాత్రం నేటికీ ప్రారంభం కాలేదు. ట్రాఫిక్ జామ్స్​​తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఈ పనులను మొదలుపెట్టడం లేదు. పనులు చేస్తామని చెబుతున్నారే తప్ప, పరిపాలన పరమైన అనుమతులు ఇవ్వడం లేదు.