పర్మినెంట్‌‌ చేసే దాకా.. సమ్మె ఆగదు

పర్మినెంట్‌‌ చేసే దాకా.. సమ్మె ఆగదు

హైదరాబాద్/ఎల్ బీ నగర్, వెలుగు:  తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలంటూ జీహెచ్‌‌ఎంసీ ఔట్‌‌సోర్సింగ్ కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. జోనల్, సర్కిల్ కార్యాలయాల వద్ద కార్మికులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌‌ వద్దకు వచ్చిన వారిని గేటు బయటే అదుపులోకి తీసుకున్నారు. దీంతో బల్దియా హెడ్ ఆఫీసుతో పాటు చార్మినార్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్ ఆఫీసుల వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. సెక్రటేరియెట్ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన జీహెచ్ఎంఈయూ ప్రెసిడెంట్ గోపాల్‌‌ని అరెస్టు చేసి సైఫాబాద్ పోలీసు స్టేషన్‌‌కి తరలించారు. 

మిగతా వారిని గోషామహల్ స్టేడియం, ఇతర పోలీసు స్టేషన్లకు తరలించి సాయంత్రం వదిలిపెట్టారు. పోలీసుల అక్రమ అరెస్టులకు తాము భయపడబోమని గోపాల్ ప్రకటించారు. పర్మినెంట్ చేసేంత వరకు సమ్మె ఆగదని స్పష్టం చేశారు. శనివారం అన్ని కార్యాలయాల వద్ద యథావిధిగా సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు.

ఎక్కడికక్కడ అరెస్టులు

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ (జీహెచ్ఎంఈయూ) శుక్రవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఉదయం నుంచే జోనల్, సర్కిల్ కార్యాలయాల ముందు కార్మికులు బైఠాయించారు. దీంతో వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. జోనల్, హెడ్ ఆఫీసు వద్ద దాదాపు వెయ్యి మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. తొలిరోజు సమ్మెలో పారిశుధ్య కార్మికులు, ఎస్ఎఫ్ఏలు, ఎంటమాలజీ, హార్టికల్చర్, ట్రాన్స్‌‌‌‌పోర్ట్, వెటర్నరీ తదితర విభాగ ఔట్ సోర్సింగ్ కార్మికులు పాల్గొన్నారు. 

యూనియన్ అధ్యక్షుడు గోపాల్ మాట్లాడుతూ.. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని, బల్దియా పర్మినెంట్ ఎంప్లాయిస్ కి ఇండ్ల స్థలాలతో పాటు ఆరోగ్య భద్రత కల్పించాలని, స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు, లేబర్లకు జీతాలు, ఈఎస్​ఐ, ఇపీఎఫ్ లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

రాంకీ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, ట్రాన్స్‌‌‌‌పోర్టు సెక్షన్‌‌‌‌లో తొలగించిన లేబర్, డ్రైవర్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల అక్రమ అరెస్టులకు  భయపడేది లేదన్నారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులను అధికారులు భయాందోళకు గుర్తిచేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు ఔట్ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు దిగడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా కాలనీల్లో చెత్త కుప్పుల పేరుకుపోయాయి. సమ్మె కొనసాగితే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. స్వచ్చ ఆటో టిప్పర్ డ్రైవర్లు కూడా కార్మికులకు మద్దతుగా నేటి నుంచి సమ్మెలో పాల్గొనే అవకాశాలున్నాయి.

ఎల్​బీ నగర్ సర్కిల్ ఆఫీసు ఎదుట 5 వేల మందితో ఆందోళన

ఔట్‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ శానిటేషన్ సిబ్బంది సరూర్ నగర్ లోని సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. మూడు సర్కిల్స్‌‌‌‌లో పనిచేసే సుమారు 5 వేల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. కార్మిక నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌‌‌‌కు తరలించారు.