హైదరాబాద్ నలుమూలలా డంపింగ్​ యార్డులు

హైదరాబాద్ నలుమూలలా డంపింగ్​ యార్డులు
  • జవహర్​నగర్​యార్డుపై లోడు తగ్గించేందుకు కసరత్తు
  •  మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డిలో స్థలాలు
  • ప్రభుత్వం ఓకే చెబితే వెంటనే ప్లాంట్లు ఏర్పాటు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జవహర్ నగర్ డంపింగ్ యార్డుపై భారం తగ్గించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. సిటీని ఆనుకుని ఉన్న మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని స్థలాలను గుర్తిస్తోంది. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో 42.22 ఎకరాలను, సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు మండలం లక్డారం గ్రామంలో 100 ఎకరాలు, మేడ్చల్​జిల్లాలోని దుండిగల్​లో 85 ఎకరాలు, చౌటుప్పల్ మండలం మల్కాపూర్ వద్ద 200 ఎకరాలను గుర్తించింది. ప్రతిపాదిత స్థలాల్లో చెత్త ప్రాసెసింగ్​యూనిట్ల ఏర్పాటుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కమిషనర్ ఆమ్రపాలి ఆయా జిల్లాల కలెక్టర్లను కోరారు. 

ప్యారా నగర్ లో నయా టెక్నాలజీతో..  

సంగారెడ్డి జిల్లా ప్యారానగర్‌‌‌‌లోని 152 ఎకరాల స్థలంలో వినూత్నంగా, యూరోపియన్ టెక్నాలజీతో చెత్త శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ అనుమతులు తీసుకుంది. ఇక్కడ 15 మెగా వాట్ల కెపాసిటీతో వేస్ట్ -టు -ఎనర్జీ ప్లాంట్‌‌‌‌ను, 270 టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇవి ఏర్పాటైతే పూర్తిగా మూసి ఉండే ట్రక్కుల ద్వారా వ్యర్థాలను తరలిస్తారు. అండర్ గ్రౌండ్ బంకర్ లో వేసి తడి, పొడిగా వేరు చేస్తారు. అనంతరం పొడి వ్యర్థాల నుంచి విద్యుత్తు, తడి వ్యర్థాల నుంచి సీబీజీ గ్యాస్ ను తయారు చేస్తారు. డ్రై డైజెసన్ టెక్నాలజీ ద్వారా తడిచెత్త నుంచి బయోగ్యాస్ తయారు చెయ్యడం వల్ల లీచెట్ సమస్య కూడా ఉండదు.