హైదరాబాద్ లో ఐదు కొత్త పార్కులు .. డెవలప్ చేసేందుకు GHMC ప్లాన్

హైదరాబాద్ లో ఐదు కొత్త పార్కులు .. డెవలప్ చేసేందుకు GHMC ప్లాన్
  • పేరు మోసిన పార్కుల తరహాలో  డెవలప్ చేసేందుకు బల్దియా ప్లాన్
  • సిటీలో భూముల కోసం అన్వేషణ
  • పాత పార్కులపైనా దృష్టి..

హైదరాబాద్ సిటీ, వెలుగు:  గ్రేటర్ లో కొత్తగా ఐదు మేజర్ పార్కులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తున్నది. పార్కుల కోసం ఎకరం.. ఆ పైన భూమి అవసరం ఉండడంతో ఎక్కడెక్కడ భూములున్నాయో వెతుకుతున్నది. అనుకున్న స్థాయిలో భూములు దొరక్కపోతే లేఅవుట్లలో ఉన్న ఓపెన్ స్పేస్ లలో అయినా పార్కులను డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నది. ఇందుకు సంబంధించిన గ్రౌండ్​వర్క్​జరుగుతోంది.

 సిటీలో పార్కులనగానే ఇందిరాపార్కు, లుంబినీ పార్కు, ఎన్టీఆర్​గార్డెన్​, సంజీవయ్యపార్కు, జలగం వెంగళరావు పార్కుల పేర్లు మాత్రమే వినిపిస్తాయి. ఇందులో కొన్ని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో, మరికొన్ని బల్దియా ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్కులు కూడా పాత పార్కుల తరహాలో పేర్లు వినిపించేలా డెవలప్​చేయాలని అధికారులు ప్లాన్​చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో దాని తర్వాత పనులు ప్రారంభించాలని చూస్తున్నారు. 

పాత పార్కులపైనా ఫోకస్

గ్రేటర్ పరిధిలో 985 పార్కులుండగా, 19 మేజర్ పార్కులు,17 థీమ్ పార్కులు ఉన్నాయి. మిగతా పార్కులు కాలనీల్లో ఉన్నాయి. ఇందులో వందకుపైగా పార్కులను  బల్దియా మెయింటెయిన్​చేస్తుండగా, మరికొన్ని పార్కులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. 753 పార్కుల మెయింటనెన్స్​ను ఆయా కాలనీల వెల్ఫెర్ అసోసియేషన్లకు అప్పగించగా, వీటికోసం ఏటా రూ.15 కోట్లకిపైగా ఖర్చు చేస్తున్నారు. ఎంట్రీ ఫీజుల కోసం నిర్వహించే టెండర్లతో ఏటా రూ.4 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఇందులో ప్రతి సంవత్సరం 75 శాతం కాలనీ వెల్పేర్ అసోసియేషన్లకు అందజేస్తోంది. అయితే, ఇంత ఖర్చు చేస్తున్నా చాలా చోట్ల వాకర్స్ కు ఇబ్బందులు తప్పడం లేదు. 

కొన్ని పార్కుల్లో వాకింగ్​ట్రాక్​లు కూడా సరిగ్గా లేవు. పార్కుల ఆవరణలో చెత్తా చెదారం పేరుకుపోయినా పట్టించుకోవడం లేదు. కొన్ని పార్కుల ప్రహారీ గోడలు కూలి పడినా రిపేర్లు చేయించడం లేదు. చాలా చోట్ల స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో సాయంత్రం తర్వాత పార్కుల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో చాలా మంది జనాలు రోడ్లపై వాకింగ్ చేస్తున్నారు. గతంలో కొన్ని పార్కుల్లో సెక్యూరిటీ గార్డులు కాపలా ఉండేవారు..రాను రాను తీసెయ్యడంతో పార్కుల కళ తప్పింది. పార్కుల్లో సమస్యలున్నాయని బల్దియాకు వేలల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో సమస్యలున్న పార్కులను డెవలప్​చేసి వాకర్స్​కు ఇబ్బందులు తప్పించాలని బల్దియా ప్లాన్​చేస్తోంది.