- రూ.4వేల కోట్లతో 17 పనులకు బల్దియా ప్రతిపాదనలు
- పరిపాలన అనుమతులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
- ఫేజ్–1 లో ఇప్పటికే 13 పనులు పెండింగ్
హైదరాబాద్,వెలుగు: స్టాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ)ఫేజ్–2 పనులు ఇప్పట్లో జరిగేలా కనిపించడంలేదు. జీహెచ్ఎంసీ ప్రతిపాదనలుపంపి ఏడాది కావస్తున్నా ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంలేదు. ఫస్ట్‌ఫేజ్ లో భాగంగా రూ.5937 కోట్లతో మొత్తం 47 పనులు చేపట్టగా ఇందులో 13 మేజర్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే సెకండ్ ఫేజ్ కోసం రూ.4వేల కోట్లతో 17 పనులు చేసేందుకు జీహెచ్ఎంసీ రాష్ట్ర సర్కార్ కు ప్రతిపాదనలు పంపింది. కాగా, ఆ పనులకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడంలేదు. దీంతో ఆ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఫస్ట్ ఫేజ్ పనులకే నిధులు లేక సతమతం అవుతుండటంతో సెకండ్ ఫేజ్ కి అనుమతులిస్తే మళ్లీ అప్పులు చేయాల్సి వస్తుందని ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నట్లు కన్పిస్తోంది.
సెకండ్ ఫేజ్‌లో ఈ పనులు
సిటీలో ట్రాఫిక్ జామ్ అవుతున్న పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించాల్సిన అవసరం ఉంది. సెకండ్ ఫేజ్ కి అనుమతులిస్తే ఈ నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా మొత్తం 17 ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్, కూకట్ పల్లి వై జంక్షన్, బండ్లగూడలో ఓ ఫ్లైఓవర్, ఒమర్ హోటల్ జంక్షన్, రేతిబౌలి–నానల్‌నగర్‌లో మల్టీలెవల్ అండర్‌పాస్, ఫలక్ నుమా ఆర్ వోబీ, కుత్బుల్లాపూర్‌లో ఫాక్స్ సాగర్ పైప్‌లైన్‌పై వంతెన నిర్మాణం, ఖాజాగూడలో సొరంగం తదితర పనులు ఉన్నాయి. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోతుండటంతో ఇందుకు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం పక్కన పడింది.
అసెంబ్లీలో గొప్పలు
అసెంబ్లీతో పాటు ఎక్కడ సమావేశాలు జరిగినా మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కౌన్సిల్, మేయర్ తో పాటు అధికార పార్టీ కార్పొరేటర్లు పదేపదే ఎస్ఆర్డీపీ పనులకు సంబంధించే చెబుతూనే ఉన్నారు. గొప్పలకు పోతున్నారు. కానీ కొత్త పనులు మాత్రం ప్రారంభించడం లేదు. ఫస్ట్ ఫేజ్ గురించి ఇంతలా చెబుతున్న వీరు సెకండ్ ఫేజ్ పనులకు సంబంధించి ఎటువంటి హామీ ఇవ్వడంలేదు. దీంతో వాహనదారుల కష్టాలు కొనసాగనున్నాయి.