హలో..వర్షం వచ్చేలా ఉంది:GHMC సోషల్‌మీడియా అలర్ట్స్

హలో..వర్షం వచ్చేలా ఉంది:GHMC సోషల్‌మీడియా అలర్ట్స్

హైదరాబాద్‌‌, వెలుగు:  సిటీలో వర్షం కురిసిందంటే రోడ్లపై నీరు నిలుస్తోంది.  వెహికల్స్ రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ట్రాఫిక్‌‌ స్తంభిస్తోంది. ఇంట్లో నుంచో, ఆఫీసు నుంచో బయటకు వెళ్లిన వారు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని వర్షంలో తడిసిపోతున్నారు. గతంలో సిటీలో వర్షం పడిన సందర్భాల్లో ఐటీ కారిడార్ లో గంట జర్నీకి 4 గంటలు పట్టిన సంగతి తెలిసిందే.

వర్షం వచ్చే సంగతి ముందే తెలిస్తే ఏ సమయంలో బయటకు వెళ్లాలో, ఎప్పుడు వెళ్లకూడదో అవగాహన ఉంటుంది. వర్షం వచ్చే సమయాన్ని బట్టి పనులను ప్లాన్‌‌ చేసుకోవచ్చు.  ఈ సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది.  రెయిన్ అలర్ట్‌‌ గురించి సోషల్‌‌ మీడియా ద్వారా పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది.

మై జీహెచ్ఎంసీ యాప్’లో

వర్షం కురిసినప్పుడు జనం ఒక్కసారిగా రోడ్లపైకి రావొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్‌‌ దానకిశోర్‌‌ ఇప్పటికే ప్రజలకు సూచించారు. కానీ వర్షం ఎప్పుడొస్తుందో ముందస్తుగా తెలియదు. అందుకే జనాలకు వర్ష సూచనల సమాచారం అందించాలని అధికారులు నిర్ణయించారు. జీహెచ్‌‌ఎంసీ ఉన్నతాధికారులు అధికారిక వాట్సప్‌‌ గ్రూప్‌‌ల్లో రెగ్యులర్‌‌గా వర్షం వచ్చే ముందు హెచ్చరిక సందేశాలు జారీ చేస్తున్నారు. వాతావరణశాఖతో సమన్వయం చేసుకుంటూ ఏయే ఏరియాల్లో వర్షం పడబోతుందో తెలుసుకుంటారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేస్తారు. సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశిస్తారు. కమిషనర్‌‌ దానకిశోర్‌‌ ఆదేశాలతో ఇప్పటికే జీహెచ్‌‌ఎంసీ అధికారిక ట్విట్టర్‌‌లో అలర్ట్‌‌లు ప్రారంభించారు. విజిలెన్స్‌‌, ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌, డిజాస్టర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ డైరెక్టర్‌‌ విశ్వజిత్‌‌ కంపాటితో పాటు పలువురు అడిషనల్‌‌ కమిషనర్‌‌లు ఈ మెసేజ్ లను పోస్టు చేస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో వర్షం పడే సూచనలు ఉన్నాయో తెలియజేస్తున్నారు. ‘మై జీహెచ్ఎంసీ యాప్‌‌’లోనూ వాతావరణ సమాచారం పేర్కొంటున్నారు.  త్వరలోనే వాతావణశాఖ సమాచారాన్ని కూడా ఈ యాప్ లో పోస్ట్‌‌ చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ట్రాఫిక్ పోలీసులు, ఐటీ కంపెనీలతో కలిసి

సోషల్‌‌ మీడియా తరహాలో జనాలను నేరుగా అలర్ట్‌‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. జీహెచ్‌‌ఎంసీ వద్ద ఆస్తి పన్ను చెల్లించే వారి వివరాలు, ఫోన్‌‌ నంబర్లున్నాయి. ఈ నంబర్లకు వాతావరణ సమాచారం, వర్ష సూచనల వివరాలు కూడా పంపించాలని అధికారులు భావిస్తున్నారు. రానున్న 24 గంటలు, 6 గంటలు, 3 గంటల్లో వాతావరణం ఎలా ఉంటుందనే సమచారం తెలియజేస్తారు.

హైదరాబాద్‌‌లో ట్రాఫిక్‌‌ పరిస్థితిని కూడా పేర్కొనేలా చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్‌‌ పోలీసులు, ఐటీ కంపెనీలతోనూ సమన్వయం చేసుకోవాలని జీహెచ్‌‌ఎంసీ భావిస్తోంది. ఇప్పటికే ట్రాఫిక్‌‌ అధికారులు, ఐటీ కంపెనీలతో అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఐటీ కంపెనీల ఉద్యోగులు ‘మై జీహెచ్‌‌ఎంసీ యాప్‌‌’ను డౌన్‌‌లోడ్‌‌ చేసుకుని వర్ష సూచనలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చెబుతున్నారు. వాతావరణం, ట్రాఫిక్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ ప్రోటోకాల్‌‌ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. మాన్‌‌సూన్‌‌ పూర్తయ్యే వరకు అధికారులు నిరంతర సమన్వయం కొనసాగించాలని నిర్ణయించారు.

ప్రత్యామ్నాయ చర్యలు

హైటెక్‌‌ సిటీ ప్రాంతంలో వర్షం పడితే పరిస్థితి గందరగోళంగా మారుతోంది. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను అప్రమత్తం చేయాలని జీహెచ్‌‌ఎంసీ సూచిస్తోంది. రానున్న 3 గంటల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవడం ద్వారా అందుకు అనుగుణంగా ఐటీ ఎంప్లాయీస్ తమ జర్నీని ప్లాన్‌‌ చేసుకునే వీలు ఉంటుంది.  ఈ దిశగా ఎంప్లాయీస్ కి ఐటీ కంపెనీలు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఓ గంట ముందుగా బయల్దేరడమో.. లేదంటే గంటసేపు ఆగి వెళ్లాలనేది నిర్ణయించుకోవచ్చు.
ఇప్పటికే ‘మై జీహెచ్‌‌ఎంసీ యాప్‌‌’ను 5 లక్షల మంది డౌన్‌‌లోడ్‌‌ చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. జీహెచ్‌‌ఎంసీ అధికారిక ట్విట్టర్‌‌ను 99 వేల మంది, ఫేస్‌‌బుక్‌‌ పేజీని 47 వేల మంది ఫాలో అవుతున్నారు. జీహెచ్‌‌ఎంసీలోని ఉన్నతాధికారులకు చెందిన వ్యక్తిగత ట్విట్టర్‌‌, ఫేస్‌‌బుక్‌‌ పేజీలకు కూడా ఫాలోవర్స్‌‌ ఉన్నారని అధికారులు అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా జనాలకు వర్ష సూచన సమాచారం అందిస్తూ..వారిని అప్రమత్తం చేస్తామని అధికారులు చెబుతున్నారు.