ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయలేం

హైకోర్టులో చేతులెత్తేసిన జీహెచ్‌ఎంసీ

28 వేల పోస్టులు మంజూరు చేయాల్సి ఉంటది

జీతాలకే ఏటా రూ.625 కోట్లు అవుతుంది

అంత చెల్లిస్తే నగర పాలన సాగనే సాగదని వాదన

హైదరాబాద్, వెలుగు: ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది సర్వీసుల్ని రెగ్యులరైజ్‌ చేయాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేయలేమని జీహెచ్‌ఎంసీ తేల్చి చెప్పేసింది. 28 వేల పోస్టులు మంజూరు చేస్తే పడే ఆర్థిక భారంతో నగర పాలన సాధ్యం కానే కాదని తెలిపింది. జీవో నంబర్‌ 4459 ప్రకారం జీతాల చెల్లింపు బాధ్యత కాట్రాక్ట్‌ ఏజెన్సీదే తప్ప జీహెచ్‌ఎంసీది కాదని చెప్పింది. ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వడాన్ని కార్మికులు ప్రశ్నించలేదు కనుక సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు చెల్లదని దాన్ని కొట్టేయాలంటూ హైకోర్టులో కౌంటర్‌ పిటిషన్‌ వేసింది. ‘‘ఔట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌కు కనీస వేతనాలను మాత్రమే చెల్లించగలం. మంజూరు పోస్టుల్లో బేసిక్‌ పే చెల్లిస్తున్నాం. కాబట్టి సింగిల్‌ జడ్జి ఆగస్టు 7న ఇచ్చిన తీర్పును కొట్టేయండి. ఆ తీర్పు ప్రకారం 28 వేల పోస్టుల్ని మంజూరు చేయాల్సి వస్తుంది. రెగ్యులరైజ్‌ చేస్తే జీతాలకే ఏటా రూ.625 కోట్లు అవసరం అవుతాయి. ఆర్థిక భారం పెరుగుతుంది. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ రాబడిలో 16.3 శాతం జీతాలకు వినియోగిస్తున్నాం. నగర పాలన కొనసాగాలంటే ఇంతకంటే సాధ్యం కాదు’’ అని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ హైకోర్టులో అదనపు కౌంటర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘‘శానిటరీ సూపర్‌వైజర్లు, ఎంటమాలజీ ఫీల్డ్‌ వర్కర్స్, ఫీల్డ్‌ సూపర్‌వైజర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్ల సర్వీసుల్ని రెగ్యులరైజ్‌ చేయడం ఆర్థికంగా చాలాపెద్ద భారం.

జీహెచ్‌‌ఎంసీలో మంజూరు పోస్ట్‌‌లు 5140. ఇందులో 2649 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సమైక్య ఏపీలోని జీవో నంబర్‌‌ 2501 ప్రకారం పలు సర్వీసులకు ఔట్‌‌సోర్సింగ్‌‌కు అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఏడాది జారీ అయిన జీవో నంబర్‌‌ 4459 ప్రకారం జీతాల చెల్లింపుల బాధ్యత కాంట్రాక్ట్‌‌ ఏజెన్సీదే. జీహెచ్‌‌ఎంసీకి సంబంధం లేదు. సింగిల్‌‌ జడ్జి వద్ద కేసులో పిటిషనర్లు ఔట్‌‌సోర్సింగ్‌‌కు కాంట్రాక్టుకు ఇవ్వడాన్ని ప్రశ్నించలేదు. కాబట్టి ఆ తీర్పు చెల్లదు. మంజూరు పోస్టులకు, కింది స్థాయిలో పనిచేసే స్టాఫ్‌‌కు పొంతన ఉండదు. ఉదాహరణకు స్వీపింగ్, శానిటేషన్‌‌ పనులకు 20,380 మంది ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఔట్‌‌సోర్సింగ్‌‌లో 27,729 మందిని తీసుకుని నెలకు రూ.13 వేల నుంచి రూ.14,500 వరకూ వేతనం చెల్లిస్తున్నాం. ఎంటమాలజీ మంజూరు పోస్టులు 217 ఉంటే 150 పనిచేస్తున్నారు. అయితే ఔట్‌‌సోర్సింగ్‌‌లో 2400 మంది పనిచేస్తున్నారు’’ అని అఫిడవిట్‌‌లో  వివరించారు.

For More News..

ఎలక్షన్ల గురించి నేనట్లా అనలే..

కేసీఆర్ తమ దగ్గర పుట్టనందుకు ఇతర రాష్ట్రాల వాళ్లు బాధపడుతున్నరు

ఫీజులు కట్టకున్నా ఆన్ లైన్ క్లాసులకు అనుమతించండి