
- ఇందులో హెచ్ సిటీ పనుల కోసమే రూ.4 వేల కోట్లు
- అప్పులు తీర్చడానికి రూ.1,200 కోట్లు
- ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు రూ.500 కోట్లు కావాలని రిక్వెస్ట్
- గతేడాది మొత్తం రూ.3,300 కోట్లు అడగగా, రూ.2,650 కోట్లు ఇచ్చిన సర్కార్
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర బడ్జెట్‌పై జీహెచ్ఎంసీ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈసారి రూ.5,700 కోట్లు కేటాయించాలని కోరింది. ప్రధానంగా హెచ్ సిటీ(హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్ ఫర్ మేటివ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్) పనుల కోసం రూ.4 వేల కోట్లు కావాలని తెలిపింది. అప్పులు తీర్చడానికి డెట్ సర్వీస్కింద రూ.1,200 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం రూ.500 కోట్లు కేటాయించాలని రిక్వెస్ట్చేసింది. గతేడాది జీహెచ్ఎంసీకి రూ.3,300 కోట్లు కావాలని కోరగా, రూ.2,650 కోట్లను కేటాయించిన సర్కారు.. రూ.1,326 కోట్లను రిలీజ్ చేసింది. బీఆర్ఎస్హయాంలో ప్రభుత్వం జీహెచ్ఎంసీని పెద్దగా పట్టించుకోలేదు. నామమాత్రపు కేటాయింపులతో బల్దియా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. నేటికీ ఆర్థికంగా కోలుకోలేకపోతోంది. కాంగ్రెస్ప్రభుత్వం వచ్చాక సీఎం సహకారంతో ఇబ్బందుల నుంచి కొద్దికొద్దిగా బయటపడుతోంది. జీహెచ్ఎంసీ కోరినట్టుగా ఈసారి బడ్జెట్ లో నిధులు కేటాయిస్తే నగరం మరింతగా అభివృద్ధి సాధిస్తుందని అధికారులు అంటున్నారు.
అప్పులే రూ.5,880 కోట్లు
జీహెచ్ఎంసీ 2016 నుంచి 2023 వరకు వివిధ పనుల కోసం ఎస్బీఐలో రూ.6,880 కోట్ల అప్పులు చేసింది. ఎస్ఆర్డీపీ పనుల కోసం రూ.4,250 కోట్ల అప్పు చేయగా, బాండ్ల ద్వారా రూ.495 కోట్లు సేకరించింది. రూ.200 కోట్లు 8.90 శాతం, రూ.195 కోట్లు 9.38శాతం, రూ.100 కోట్లు 10.23 శాతం వడ్డీకి తీసుకుంది. రూ.2,500 కోట్లను 8.65 శాతం వడ్డీకి రూపీ టర్మ్‌లోన్ తీసుకోగా, మరోసారి రూ.505 కోట్లను 7.75 శాతం వడ్డీకి రూపీ టర్మ్ లోన్ తీసుకుంది. వీటితో పాటు ఇటీవల మరో రూ.750 కోట్లను సేకరించింది.
కాంప్రెన్సివ్రోడ్మెయింటెనెన్స్ప్రోగ్రాం(సీఆర్ఎంపీ) కోసం 7.20 శాతం వడ్డీతో రూ.1,460 కోట్లు తీసుకుంది. ఎస్ఎన్డీపీ కోసం రూ.680 కోట్లను 7.20 శాతం వడ్డీతో, జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్ల కోసం రూ.140 కోట్ల హడ్కో లోన్ తీసుకుంది. హడ్కో లోన్‌లో రూ.100 కోట్లను 8.90 శాతం వడ్డీతో తీసుకోగా, రూ.40 కోట్లను 9.90 శాతం వడ్డీకి తీసుకుంది. వీటితో పాటు కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల కోసం ట్రేడ్స్ ద్వారా రూ.350 కోట్ల అప్పు చేసింది. రూ.6,880 కోట్లలో వెయ్యి కోట్లను గతేడాది చెల్లించింది. దీంతో ప్రస్తుతం రూ.5,880 కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ బడ్జెట్ లో అప్పులు తీర్చేందుకు నిధులు కేటాయిస్తే మరింత భారం తగ్గనున్నది.
నగర అభివృద్ధికి హెచ్ సిటీ పనులే కీలకం
నగరంలో చేపడుతున్న పనుల్లో హెచ్ సిటీ పనులే ఇప్పుడు కీలకం కానున్నాయి. హెచ్-సిటీ ద్వారా రూ.7,032 కోట్లతో బల్దియా 25 పనులు చేస్తోంది. ఇందులో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, ఆర్ ఓబీలు ఉన్నాయి. వీటితోపాటు రోడ్డు విస్తరణకు సంబంధించిన మరో 13 పనులు చేపట్టనుంది. ఇందులో కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు ఉన్నాయి. రూ.580 కోట్ల అంచనా వ్యయంతో కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్, ముగ్ధా జంక్షన్ల వద్ద మూడు అండర్‌పాస్‌లు, రెండు స్టీల్ బ్రిడ్జిలు నిర్మించనున్నది. రెండో ప్యాకేజీలో భాగంగా రూ.510 కోట్లతో రోడ్‌నెంబర్ 45 జంక్షన్, ఫిల్మ్‌నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లలో నాలుగు స్టీల్ బ్రిడ్జిలు, నాలుగు అండర్ పాస్‌లు కట్టనున్నది. ఈ పనులు ఏడాదిన్నరలో చేయాలని అధికారులు టార్గెట్పెట్టుకున్నారు.
నాలాల పనులు కూడా..
హెచ్ సిటీలో భాగంగా బల్దియా నాలాలను కూడా నిర్మిస్తోంది. గత ప్రభుత్వం స్టాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్లాన్(ఎస్ఎన్డీపీ) పేరుతో ఫేజ్ 1 కింద 37 నాలాల పనులు చేపట్టింది. ఇందులో నాలుగు పనులు మినహా అన్నిపూర్తయ్యాయి. అయితే, కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత హెచ్ సిటీలో భాగంగా ఈ పనులు చేయాలని నిర్ణయించింది. సెకండ్ ఫేజ్ కింద రూ.5,135 కోట్లతో సిటీతోపాటు శివారు మున్సిపాలిటీల్లో 415 పనులు చేపట్టాలని డిసైడ్అయ్యింది. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే కొన్ని పనులకి సంబంధించి టెండర్లు కూడాపూర్తయ్యాయి.
రూ.5 వేల కోట్లు అడిగిన వాటర్ బోర్డు
గ్రేటర్ పరిధిలో మంచినీటి సరఫరాకు, చేపట్టిన ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు రాష్ట్ర బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని మెట్రోవాటర్‌బోర్డు కోరింది. త్వరలో ప్రారంభించబోయే గోదావరి–2, 3 దశల ప్రాజెక్టుతోపాటు, ఔటర్ రింగ్‌రోడ్ పరిధిలోని ప్రాంతాలకు తాగునీటి సరఫరాకు పైప్లైన్విస్తరణ, జంటజలాశయాల నుంచి నీటి తరలించేందుకు నిర్మిస్తున్న మినీవాటర్ఫిల్టర్స్, పైప్లైన్పనులు, నెలా నెలా బోర్డుపై భారంగా మారుతున్న విద్యుత్‌బకాయిల చెల్లింపునకు నిధులు అవసరమని చెప్పింది.
శివారు ప్రాంతాల తాగునీటి అవసరాలతోపాటు, కొత్తగా చేపట్టిన ఔటర్వాటర్రింగ్రోడ్ప్రాజెక్ట్–3 కోసం నిధులు అవసరమవుతాయని తెలిపింది. బోర్డుకు నెలకు రూ.100కోట్లు నుంచి రూ.110 కోట్లు ఆదాయం వస్తున్నా ఎక్కువ శాతం ఉద్యోగుల జీతాలు, కరెంట్బిల్లులకే ఖర్చు చేయాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. మెయింటెనెన్స్పనుల నిర్వహణకు కూడా నిధులు అవసరమవుతాయని, రూ. 5 వేల కోట్లు ఇవ్వాలని కోరారు.