
- యాజమాన్యం విజ్ఞప్తితో మూడు రోజుల గడువు
బషీర్‌బాగ్, వెలుగు: ప్రాపర్టీ టాక్స్ చెల్లించడంలేదని కాచిగూడలోని ప్రతిమ హాస్పిటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు గురువారం సీజ్‌చేశారు. తర్వాత యాజమాన్యం మూడు రోజులు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడంతో అంటించిన నోటీసులను తొలగించారు. రెండేండ్లుగా ఆస్తి పన్ను చెల్లించాలని కోరుతున్నా హాస్పిటల్యాజమాన్యం స్పందించడం లేదు. దీంతో జీహెచ్ఎంసీ అసిస్టెంట్ కమిషనర్లు పి.రవీందర్, బి.రవీందర్, రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్సిబ్బంది గురువారం ప్రతిమ హాస్పిటల్‌కు చేరుకుని కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫర్నిచర్‌ను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ 2022 అక్టోబర్ నుంచి ప్రతిమ యాజమాన్యం ప్రాపర్టీ టాక్స్ చెల్లించడం లేదని, పలుమార్లు నోటీసులు జారీచేసినా పట్టించుకోలేదన్నారు. చివరిసారిగా గత నెలలో నోటీసులు జారీ చేసినా స్పందన లేదన్నారు. రెండేండ్లకు కలిపి రూ.37లక్షల35 వేల 713 ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉందన్నారు. యాజమాన్యం విజ్ఞప్తి మేరకు మూడు రోజులు సమయం ఇచ్చామని వెల్లడించారు.