జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్​ కలెక్షన్​ రూ.2,037 కోట్లు

జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్​ కలెక్షన్​ రూ.2,037 కోట్లు
  • బల్దియా చరిత్రలో మొదటిసారి రూ.2 వేల కోట్లు దాటిన వసూళ్లు
  • టార్గెట్​ రీచ్​ అయిన అధికారులు 
  • ఓటీఎస్​ ద్వారా రూ.450 కోట్లు 
  • ఏడాది చివరి రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్​

హైదరాబాద్ సిటీ, వెలుగు:  ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్​లో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి రూ.2 వేల కోట్లకు పైగా వసూలు చేసింది. బల్దియా అధికారులు 2024–25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పెట్టుకున్న టార్గెట్​రీచ్ అయ్యారు. ఆర్థిక సంవత్సరంలో చివరి రోజైన సోమవారం ఒక్కరోజే రూ.100 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. మొత్తంగా రూ.2,037 కోట్లు వసూలైనట్లు బల్దియా అధికారులు ప్రకటించారు. ఇందులో మార్చి నెల 8 నుంచి అమలు చేసిన ఓటీఎస్(వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్) ద్వారా రూ.450 కోట్లు వచ్చాయన్నారు. ఈసారి ఓటీఎస్​కు మంచి రెస్పాన్స్​వచ్చిందని, టార్గెట్​రీచ్​కావడానికి కారణమైందని తెలిపారు. గతేడాది కూడా రూ.2 వేల కోట్ల మార్క్ దాటాలని అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. 

ట్యాక్స్​కలెక్షన్​కు అనేక చర్యలు తీసుకున్నారు. కానీ రూ.1,917 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఈసారి కమిషనర్ ఇలంబరితి సహా రెవెన్యూ అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంత్, చీఫ్ వ్యాల్యూవేషన్ ఆఫీసర్ మహేశ్ కులకర్ణి ఎప్పటికప్పుడు కిందిస్థాయి అధికారులను కోర్డినేట్ చేస్తూ ఆదాయాన్ని భారీగా  పెంచారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పన్ను వసూళ్ల కోసం తీసుకున్న నిర్ణయాలతో ప్రజల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. నోటీసులు జారీ, కోట్లల్లో బకాయిలు ఉన్న ప్రాపర్టీలను సీజ్ చేయడంతో మొండి బకాయిలు వసూలయ్యాయి.

ఈ ఏడాది భారీగా ఆదాయం

గడిచిన ఐదేళ్లతో పోలిస్తే ఈసారి ప్రాపర్టీ ట్యాక్స్​భారీగా వసూలైంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో  రూ.1,357 కోట్లు, 2020–21లో రూ.1,633 కోట్లు, 2021–22లో రూ.1,681 కోట్లు, 2022–23లో రూ.1,658 కోట్లు, 2023–24లో రూ.1,917 కోట్లు, 2024–25లో రూ.2,037 కోట్ల ట్యాక్స్​ వసూలైంది. కొన్నేండ్లుగా రూ.2 వేల కోట్లు దాటాలని చూసినా కుదరలేదు. వరుసగా ఓటీఎస్​అమలు చేసినా టార్గెట్ రీచ్ కాలేదు. ఈసారి 2 వేల కోట్ల మార్క్ దాటడంపై కమిషనర్ ఇలంబరితి సంతోషం వ్యక్తం చేశారు. కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ప్రాపర్టీ దారుల ముందుకొచ్చి వారి పన్నులు చెల్లించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఏటా ప్రజలు ఇలాగే సహకరించాలని కోరారు.

ఇయ్యాల్టి నుంచి ఎర్లీ బర్డ్ స్కీమ్ అమలు

 జీహెచ్ఎంసీ పరిధిలో మంగళవారం నుంచి ‘ఎర్లీ బర్డ్’ స్కీమ్ అమలులోకి వచ్చింది. 2025-–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తే 5 శాతం రిబెట్ రానుంది. ఈ నెలాఖరు వరకు ఈ స్కీమ్ అమల్లో ఉండనుంది. ఆన్ లైన్, సీఎస్సీ సెంటర్ల నుంచి పేమెంట్ చేసినా కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. ప్రాపర్టీ దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  అధికారులు కోరుతున్నారు. ఎర్లీ బర్డ్​ద్వారా రూ.850 కోట్లకిపైగా ప్రాపర్టీ ట్యాక్స్​కలెక్ట్​చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. 

తొమ్మిదేండ్లుగా జీహెచ్ఎంసీలో ఎర్లీబర్డ్ అమలు చేస్తున్నారు. ఈ స్కీమ్ కు ఏటా స్పందన పెరుగుతూ వస్తోంది. 2017-–18 ఆర్థిక సంవత్సరంలో రూ.362 కోట్లు రాగా, 2018-–19లో రూ.432కోట్లు, 2019–20లో రూ.535 కోట్లు, 2020–-21లో రూ.572 కోట్లు, 2021-–22(కరోనా సమయంలోనూ) రూ.541 కోట్లు వచ్చింది. 2022-–23 ఆర్థిక సంవత్సరంలో రూ.743 కోట్లకు పెరిగింది. 2023–24లో రూ.766  కోట్లు రాగా, 2024–25లో రూ.830  కోట్లు వచ్చింది. ఈసారి రూ.850 కోట్లు వస్తాయని అధికారులు ఆశిస్తున్నారు.