ఈసారి ప్రాపర్టీ ట్యాక్స్​ కలెక్షన్ టార్గెట్​ రూ.3 వేల కోట్లు : కమిషనర్ ఇలంబరితి

ఈసారి ప్రాపర్టీ ట్యాక్స్​ కలెక్షన్ టార్గెట్​ రూ.3 వేల కోట్లు : కమిషనర్ ఇలంబరితి
  •  మొండి బకాయిదారులకు నోటీసులు ఇవ్వండి 
  • బల్దియా కమిషనర్ ఇలంబరితి ఆదేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో రూ.3 వేల కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి అధికారులను చెప్పారు. పెండింగ్​పెడుతున్న వారికి నోటీసులు ఇచ్చి, పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. 2024-–25లో బల్దియా అధికారులు రూ.2,038 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తూ శుక్రవారం బంజారాహిల్స్ లోని బంజారాభవన్​లో అభినందన సభ నిర్వహించారు.

కమిషనర్ మాట్లాడుతూ.. ట్యాక్స్ కలెక్షన్​సిబ్బంది ఇదే ఉత్సాహంతో పనిచేయాలన్నారు. ‘వన్ టైమ్ సెటిల్‌‌మెంట్’ స్కీమ్ తో మంచి ఫలితాలు వచ్చాయన్నారు.  టార్గెట్​కు మించి రూ.121 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందన్నారు. అత్యధికంగా పన్ను వసూలు చేసిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు. అడిషనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, వేణుగోపాల్ రెడ్డి, రఘు ప్రసాద్, వేణుగోపాల్, సామ్రాట్ అశోక్, సరోజ, జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, ఉపేందర్ రెడ్డి, రవికిరణ్, వెంకన్న, సీసీపీ శ్రీనివాస్, జాయింట్ కమిషనర్ మహేష్ కులకర్ణి, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.