అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు : రంగారెడ్డి జిల్లాలోని మూడు గ్రామాలకు జీహెచ్ఎంసీ మురుగు శాపంగా మారింది. గ్రేటర్సిటీని ఆనుకుని ఉండడంతో కొన్నేండ్లుగా మురుగు ముంచెత్తుతోంది. ఆయా గ్రామాల ప్రజలు ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా, ఎంత మంది ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలోని వందల కాలనీల నుంచి వస్తున్న మురుగు నేరుగా గ్రామాల్లోని చెరువుల్లోకి చేరుతోంది. ఇదే అదునుగా కెమికల్స్ఫ్యాక్టరీల నిర్వాహకులు వ్యర్థాలను తెచ్చి, మురుగు ప్రవాహంలో డంప్‌చేస్తున్నారు.
దీంతో చెరువుల్లోని నీళ్లు కలుషితం అవుతున్నాయి. వేలాది చేపలు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు వ్యవసాయం, పాడి దెబ్బతింటోంది. రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ప్రభుత్వం తమని పట్టించుకున్న పాపాన పోలేదని, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ప్రభుత్వమైనా మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని కుంట్లూరు, పసుమాముల, హయత్నగర్మండలంలోని తారామతిపేట గ్రామాల్లోని పరిస్థితి ఇది.
14 ఏండ్లుగా సమస్య..
14 ఏండ్ల కింద జీహెచ్ఎంసీ పరిధిలోని వందల కాలనీల్లో ఉత్పత్తి అవుతున్న మురుగును సీవరేజ్ట్రీట్మెంట్ప్లాంట్లకు తరలించుకుండా కుంట్లూరు చెరువులోకి వెళ్లేలా చేశారు. అప్పటి నుంచి కుంట్లూరు గ్రామాన్ని మురుగు వెంటాడుతోంది. మొదట్లో పెద్దగా సమస్య లేకపోయినా, తర్వాత మారిన పరిస్థితులతో గ్రామస్తులు రోడ్డెక్కారు. ఊరు ఆగమవుతోందని, మురుగు నీరు తమ వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆందోళనలు, నిరసనలు చేస్తూ వచ్చారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్నేతలు పట్టించుకున్న పాపాన పోలేదు. గ్రామస్తుల పోరాటంతో స్పందించిన అధికారులు డ్రైనేజీ లైన్ఏర్పాటు చేసి కుంట్లూరు వైపు వస్తున్న మురుగును పక్క గ్రామమైన పసుమాములకు తరలించి చేతులు దులుపుకున్నారు.
సమస్య కుంట్లూరు నుంచి పసుమామూల వైపు డైవర్ట్అయ్యిందే తప్ప పరిష్కారం దొరకలేదు. పసుమాముల గ్రామ పరిధిలోని 117 ఎకరాల్లో ఉన్న చెరువులోకి మురుగు చేరుతోంది. వేల చేపలు మృత్యువాత పడుతున్నాయి. చెరువు ఆయకట్టు కింద 250 ఎకరాల్లోని పంటలు దెబ్బతింటున్నాయి. పసుగ్రాసం పెరగక పాడి తగ్గిపోతోంది. కాయగూరలు, ఆకుకూరలు అంతకు ముందులా పండడం లేదు. పసుమాముల గ్రామస్తులు జిల్లా కలెక్టర్నుంచి రాష్ట్ర స్థాయిలోని ఉన్నతాధికారుల వరకు ఎన్ని వినతులు ఇచ్చినా సమస్య తీరలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం స్థానిక బీఆర్ఎస్నేతలు పసుమాముల వైపు వెళ్తున్న మురుగు నీటిని ఔటర్ రింగ్ రోడ్డు కింది నుంచి తారామతిపేట వైపు డైవర్ట్చేశారు. దీంతో మురుగు నేరుగా అంటమాసాని చెరువులోకి చేరుతోంది.
ఔటర్‌పై కెమికల్స్ డంపింగ్
ఔటర్ రింగ్‌రోడ్డు కింది నుంచి మురుగు వెళ్తుండడం కెమికల్స్ ఫ్యాక్టరీల నిర్వాహకులకు కలిసి వస్తోంది. అర్ధరాత్రిలు ట్యాంకర్లలో కెమికల్స్వేస్టేజ్తెచ్చి, మురుగు ప్రవాహంలో పారబోస్తున్నారు. దీంతో అంటమాసాని చెరువు విషపూరితమైంది. మురుగు ప్రవాహం ఎక్కువై అక్కడి నుంచి పెద్దచెరువు(పొల్కమ్మ చెరువు)కు చేరుతోంది. ప్రస్తుతం ఆ చెరువు కూడా నిండి మైసమ్మ చెరువులోకి మురుగు చేరుతుంది. తారామతిపేటలోని మూడు చెరువుల్లో డేంజర్బెల్స్మోగుతున్నాయి. ఊరంతా కెమికల్స్కంపు కొడుతుంది.
గ్రామస్తులు శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. మురుగులో దోమలు స్వైర విహారం చేస్తుండడంతో డెంగీ, మలేరియా బాధితులు పెరుగుతున్నారు. రాత్రిళ్లు భరించలేని కంపు కొడుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుంచో మురుగును తెచ్చి మా గ్రామంపై పోస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే స్థానికంగా ఉన్న స్టోన్‌క్రషర్స్, డాంబర్ ప్లాంట్లతో ఇబ్బందులు పడుతున్నామని, కొత్తగా మురుగు, కెమికల్స్వేస్టేజ్సమస్యను తెచ్చి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
చుట్టాలు పూటకు మించి ఉంటలేరు
మురుగుతో ఊరు ఆగం అవుతోంది. కంపును భరించలేకపోతున్నాం. మా ఇండ్లకు వచ్చే చుట్టాలు ఒక్కపూటకు మించి ఉండడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మా ఊరి పిల్లలకు పెండ్లిళ్లు అయ్యే పరిస్థితి ఉండదు. ఆడ పిల్లలను ఇచ్చేటోళ్లు, చేసుకునేటోళ్లు ఉండరు. మురుగు నీటితో చర్మవ్యాధులు పెరుగుతున్నాయి.
– గడ్డం లక్ష్మయ్య, తారామతిపేట గ్రామస్తుడు
వ్యవసాయం దెబ్బతింది
కొన్నేండ్లుగా కొనసాగుతున్న స్టోన్‌క్రషర్స్, డాంబర్ ప్లాంట్లతో సతమతం అవుతున్నాం. అవి చాలవన్నట్లు అధికారులు మురుగు సమస్యను తెచ్చిన మా నెత్తిన పెట్టారు. మురుగు నీటితో ఊరంతా ఆగమైంది. వ్యవసాయం దెబ్బతినింది. అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు.
– శ్రీధర్, తారామతిపేట గ్రామస్తుడు
బాక్స్ డ్రైన్‌ను మధ్యలోనే వదిలేశారు
జీహెచ్ఎంసీ పరిధిలోని మురుగును మూడు ఫేజ్‌లుగా విభజించి, మూసీ నదిలో కలపాలని అధికారులు గతంలో నిర్ణయించారు. నాలుగేండ్ల కింద రూ.14 కోట్లతో కుంట్లూరు నుంచి పసుమాముల దాటేంత వరకు బాక్స్ డ్రైన్ నిర్మించారు. భూదాన్ కాలనీ వరకు తీసుకుకొచ్చి వదిలేశారు. తర్వాత రూ.32 కోట్ల నిధులు కేటాయించగా ఆ పనులు జరగలేదు. ఉన్నతాధికారులు స్పందించి మురుగును మూసీలో కలిసేలా చూస్తే సమస్యకు పరిష్కారం దొరకుతుందని స్థానికులు చెబుతున్నారు. డ్రైన్పనులను తిరిగి ప్రారంభించాలని కోరుతున్నారు.