GHMC ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు: జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని హైదరాబాద్ ఇన్​చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. త్వరలోనే డివిజన్లవారీగా పాదయాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 7, 8, 9వ తేదీల్లో హైదరాబాద్‎లో నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు జీహెచ్‎ఎంసీ కీలక నేతలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో ఆదివారం మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు.

ఈ మీటింగ్‎కు ఏఐసీసీ ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ‘‘ప్రజాపాలన విజయోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికెళ్లి కాంగ్రెస్ శ్రేణులు వివరించాలి. అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై అవగాహన కల్పించాలి. కార్పొరేటర్లు నిత్యం ప్రజల మధ్య ఉండాలి. 

వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ఈ నెల 9న సెక్రటేరియెట్‎లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటది. ట్యాంక్​బండ్‎పై దాదాపు లక్ష మందితో విజయోత్సవాలు నిర్వహించనున్నాం. గ్రేటర్ హైదరాబాద్ నుంచి భారీగా జనాన్ని సమీకరించాలి’’అని పొన్నం పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని ఏఐసీసీ ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షి తెలిపారు.
  
కష్టపడ్డోళ్లకే పదవులు: మహేశ్ గౌడ్

ఏడాది పాలనలోనే ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసిందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. వచ్చే నాలుగేండ్లలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడ్తామని తెలిపారు. ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించామని, త్వరలోనే మరిన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. కష్టపడి పని చేసిన వారికే పదవులు ఇస్తామని తెలిపారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ ఉండాలంటే నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు.

ఈ నెల 4న పెద్దపల్లి యువ వికాసం బహిరంగ సభ, 7, 8, 9వ తేదీల్లో హైదరాబాద్‎లో కార్నివాల్ ఉత్సవాలు నిర్వహిస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తెలిపారు. సమావేశంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్,  శ్రీ గణేశ్, ఎమ్మెల్సీలు అమీర్ అలీ ఖాన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.